స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించాలి

జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ

విజయవాడ, ఆంధ్రప్రభ: స్వాతంత్య్ర స్ఫూర్తి ఉట్టిపడేలా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు మాకినేని బస్సు పున్నయ్య స్టేడియంలో అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, వివిధ శాఖలు తమకు అప్పగించిన బాధ్యతలను సమన్వయంతో, ఎలాంటి లోపాలకు తావులేకుండా పూర్తి చేయాలని సూచించారు. రాష్ట్ర ఐటి, విద్యా శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నట్లు తెలిపారు.

వేడుకల ప్రాంగణంలో వేదిక, బారికేడింగ్, పార్కింగ్, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, భద్రత తదితర ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించేలా ఆకర్షణీయమైన శకటాలు, స్టాళ్లు ఏర్పాటు చేయాలని, శకటాలకు సంబంధించిన డిజిటల్ నోట్స్‌ను సీపీఓకు వెంటనే పంపాలని సూచించారు. దేశభక్తి, జాతీయ సమైక్యత, దేశ నిర్మాణ స్ఫూర్తిని ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని తెలిపారు.

వివిధ శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన అధికారులు, సిబ్బందిని గుర్తించి ప్రశంసా పత్రాలు అందజేయాలని ఆదేశించారు. రాబోయే 21 ఏళ్లలో తలసరి ఆదాయం పెంపు, పారిశ్రామిక అభివృద్ధి, వ్యవస్థాపకత, ఉపాధి అవకాశాల విస్తరణ, యువత నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలపై దృష్టి సారించాలని తెలిపారు. ఆగస్టు 14, 15 తేదీల్లో అన్ని ప్రభుత్వ భవనాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో త్రివర్ణ దీపాలంకరణ చేపట్టాలని ఆదేశించారు. ఆగస్టు 14న ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ప్రభుత్వ కార్యాలయాలు, ఇళ్ల ప్రాంగణాల్లో పెద్దఎత్తున మొక్కలు నాటాలని సూచించారు.

ఆగస్టు 13 నుంచి 15 వరకు ప్రతి ఇల్లు, వ్యాపార సముదాయం, ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ జెండాను ఎగురవేసేలా ప్రజలను ప్రోత్సహించాలని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించి విద్యార్థులు తాము భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారు, రాష్ట్ర అభివృద్ధికి ఎలా తోడ్పడాలనుకుంటున్నారు అనే అంశాలపై తమ సొంత స్వయం ప్రతిజ్ఞ రూపొందించుకునేలా ప్రోత్సహించాలని ఆదేశించారు.

ప్రతిజ్ఞ అందరికీ ఒకే విధంగా కాకుండా విద్యార్థుల సొంత ఆలోచనలు, వ్యక్తిగత లక్ష్యాలకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి, నిర్దేశించిన గడువులోగా ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.