డీఎస్సీ అక్రమాలపై వైసీపీ నిరసన గళం

నర్సాపురం, ఆంధ్రప్రభ: డీఎస్సీ నియామకాల్లో అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసన చేపట్టింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా నర్సాపురం నియోజకవర్గంలో సోమవారం ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నలుమూలల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

పశ్చిమగోదావరి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో పార్టీ శ్రేణులు కదం తొక్కాయి. కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ నియామకాల్లో అవినీతి, అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ నాయకులు విమర్శలు చేశారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలని, నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ర్యాలీకి పోలీసులు అడ్డంకులు సృష్టించారు. స్థానిక పార్టీ కార్యాలయం నుంచి జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు నేతృత్వంలో బయలుదేరిన ర్యాలీని పోలీసులు నిలిపివేశారు. ర్యాలీకి అనుమతి లేదని, కొనసాగించవద్దని సూచించడంతో పోలీసులకు, పార్టీ నాయకులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

ఈ సందర్భంగా ప్రసాదరాజు మాట్లాడుతూ.. శాంతియుతంగా నిర్వహిస్తున్న ర్యాలీని అడ్డుకోవడం సరికాదని పోలీసులను కోరారు. అయినప్పటికీ పోలీసులు అనుమతి లేదని చెప్పడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులు అడ్డంకులు తొలగించడంతో ర్యాలీ కొనసాగింది.

నాయకులు, కార్యకర్తలు ప్లకార్డులు చేతబట్టి శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, అభిమానులు పాల్గొన్నారు.