12వ వేజ్‌ బోర్డు కోసం జాతీయ కార్మిక సంఘాల ఆందోళన

జీఎం కార్యాలయం ముందు ధర్నా..

లేబర్‌ కోడ్ల రద్దుకు డిమాండ్‌

గోదావరిఖని ఆంధ్రప్రభ: సింగరేణి బొగ్గు పరిశ్రమలో 12వ వేజ్‌ బోర్డు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. సోమవారం సాయంత్రం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని సింగరేణి జీఎం కార్యాలయం ముందు జాతీయ కార్మిక సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు.

వేజ్‌ బోర్డు అమలులో జరుగుతున్న జాప్యంపై కార్మిక సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిటీ ఏర్పాటు చేయకుండా యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. ఈ సందర్భంగా గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ జూలై 1 నుంచి 12వ వేజ్‌ బోర్డు అమలు కావాల్సి ఉన్నప్పటికీ, కోల్‌ ఇండియా యాజమాన్యం ఇప్పటివరకు వేజ్‌ బోర్డు ప్రక్రియను ప్రారంభించలేదని ఆరోపించారు. వెంటనే వేజ్‌ బోర్డు కమిటీని ఏర్పాటు చేసి అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

వేతన ఒప్పందం విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తోందని ఆయన విమర్శించారు. కార్మిక వర్గం పట్ల కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని సీఐటీయూ అధ్యక్షుడు తుమ్మల రాజిరెడ్డి అన్నారు. బొగ్గు గని కార్మికులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.

ఐఎన్‌టీయూసీ నాయకుడు ధర్మపురి మాట్లాడుతూ కార్మికులకు అన్యాయం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జాతీయ కార్మిక సంఘాలన్నీ ఐక్యంగా పోరాడతాయని సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు.

అనంతరం జాతీయ కార్మిక సంఘాల నాయకులు ఆర్జీ-1 జీఎంకు వినతిపత్రం సమర్పించారు. ధర్నా కార్యక్రమంలో జాతీయ కార్మిక సంఘాల నాయకులు మడ్డి ఎల్లాగౌడ్‌, తుమ్మల రాజిరెడ్డి, రంగు శ్రీను, సదానందం తదితరులతో పాటు కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.