ఆషాఢ సారె ముగింపు.. శ్రావణానికి సన్నాహాలు

  • 12న జమ్మిదొడ్డి నుంచి దేవస్థానం సిబ్బంది సారె సమర్పణ
  • 13 నుంచి భక్తులకు శ్రావణ మాస సేవలు..
  • వరలక్ష్మి వ్రతానికి ఏర్పాట్లు
  • దర్శనం, తాగునీరు, ప్రసాదాలపై ప్రత్యేక దృష్టి: ఈవో శీనా నాయక్‌
  • 15న రాజగోపురం ప్రాంగణంలో స్వాతంత్య్ర వేడుకలు

(ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ) : ఆషాఢ సారె ముగింపు ఉత్సవాలు, శ్రావణ మాసం ఏర్పాట్లు, స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను సమర్థంగా నిర్వహించేందుకు ఇంద్రకీలాద్రి దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్‌ అధికారులను అప్రమత్తం చేశారు. సోమవారం ఈవో కార్యాలయంలో వివిధ విభాగాల అధికారులు, స్థానాచార్యులు, వైదిక కమిటీ సభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించి ఏర్పాట్లపై చర్చించారు.

ఆషాఢ మాసం ఈనెల 12తో ముగియనున్న నేపథ్యంలో అదే రోజు ఉదయం 8.30 గంటలకు జమ్మిదొడ్డి నుంచి దేవస్థానం సిబ్బంది సారె సమర్పణ కార్యక్రమం ప్రారంభమవుతుందని అధికారులు ఈవోకు వివరించారు. కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.

శ్రావణ మాసానికి సిద్ధం కావాలి..

ఇంద్రకీలాద్రి దేవస్థానం పై ఆగస్టు 13 నుంచి ప్రారంభమయ్యే శ్రావణ మాసంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఈవో ఆదేశించారు. ఆర్జిత సేవగా కుంకుమార్చన, వరలక్ష్మి వ్రతం, ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతం నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా దర్శనం క్యూలైన్లు, తాగునీటి సరఫరా, ఉచిత ప్రసాదం, అన్నప్రసాదం తదితర అంశాలను సమీక్షించి అన్ని విభాగాలు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.

15న రాజగోపురం వద్ద జెండా వందనం..

భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 15న దేవస్థానంలో నిర్వహించాల్సిన కార్యక్రమాలపైనా సమావేశంలో చర్చించారు. ఈసారి ప్రధాన రాజగోపురం ప్రాంగణంలో జెండా వందనం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఈవో ఆదేశించారు. కార్యక్రమంలో దేవస్థానం సిబ్బందికి అభినందన పురస్కారాలు అందజేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని వివిధ విభాగాలకు బాధ్యతలు అప్పగించారు. సమావేశంలో దేవస్థానంలోని వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.