డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలి..

  • మాజీ ఎమ్మెల్యే జగన్‌మోహన్‌రావు

నందిగామ, ఆంధ్రప్రభ : టీచర్‌ ఉద్యోగ నియామకాల్లో జరిగినట్లు ఆరోపిస్తున్న అవినీతి, అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని నందిగామ మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ మొండితోక జగన్‌మోహన్‌రావు డిమాండ్‌ చేశారు. ఎన్నికల ముందు నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, కొత్త ఉద్యోగ అవకాశాల పేరుతో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ప్రస్తుతం నిరుద్యోగులను మోసం చేస్తోందని ఆయన ఆరోపించారు.

డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో సోమవారం నందిగామ పట్టణంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. నిరుద్యోగ యువత, విద్యార్థులు, వైసీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా సాగిన ర్యాలీ గాంధీ సెంటర్‌కు చేరుకుంది. అక్కడ మహాత్మాగాంధీ విగ్రహం సాక్షిగా ‘జెన్‌-జీ’ యువత తమ నిరసనను వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ప్రశ్నించడం కూడా తప్పుగా మారిందని విమర్శించారు. యువత, నిరుద్యోగుల సమస్యలపై తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఉద్యమాన్ని అణచివేయడానికి ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెనక్కి తగ్గేది లేదని అన్నారు.

కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయులతో ప్రభుత్వం ర్యాలీలు నిర్వహించడం దాని బలహీనతకు నిదర్శనమని వైసీపీ నేతలు విమర్శించారు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. ‘జెన్‌-జీ’ యువత ప్రశ్నిస్తోందని అన్నారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ మొండితోక జగన్‌మోహన్‌రావు మాట్లాడుతూ ఎన్నికల హామీల్లో భాగంగా నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి ఇస్తామని చెప్పి అమలు చేయలేదని ఆరోపించారు. కళాశాల విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌, వసతి దీవెన బకాయిలను కూడా ప్రభుత్వం విడుదల చేయలేదని విమర్శించారు.

ప్రజాస్వామ్యంలో జరుగుతున్న తప్పులపై నిరసన వ్యక్తం చేయడం తమ హక్కు అని అన్నారు. 40 శాతం ఓట్లతో ప్రతిపక్షంగా ఉన్న వైఎస్సార్‌సీపీ ప్రజల పక్షాన, యువత, విద్యార్థుల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటుందని తెలిపారు.

శాంతియుత ర్యాలీలు, నిరసనలకు అనుమతి లేదంటూ ప్రభుత్వం పోలీసుల ద్వారా అడ్డంకులు సృష్టిస్తోందని, అక్రమ కేసులతో బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. భయపడే ప్రసక్తే లేదని, ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, నిరుద్యోగ యువత తదితరులు పాల్గొన్నారు.