వరద కాలువలో కొట్టుకుపోయి వ్యాన్‌.. 9 మంది మృతి

భోపాల్, ఆంధ్ర‌ప్ర‌భ‌ : మధ్యప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ వ్యాన్‌ వరద ఉధృతికి కాలువలో పడి కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా.. మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. రాజ్‌గఢ్‌ జిల్లాలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు, SDRF సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో వ్యాన్‌లో డ్రైవర్‌తో పాటు మొత్తం 11 మంది ఉన్నట్లు గుర్తించారు.

క్రేన్ల సాయంతో కాలువలో నుంచి వ్యాన్‌ను బయటకు తీసిన రెస్క్యూ బృందాలు మృతదేహాలను వెలికితీశాయి. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.