లేబర్‌ కోడ్లను రద్దు చేయాలి

కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా తాడ్వాయిలో రాస్తారోకో

తాడ్వాయి, ఆంధ్రప్రభ : లేబర్‌ కోడ్లను రద్దు చేయాలని రైతు సంఘం ములుగు జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సోమవారం తాడ్వాయి మండల కేంద్రంలో 163వ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.

1942 ఆగస్టు 9న జరిగిన క్విట్‌ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా తాడ్వాయిలో భారీ రాస్తారోకో చేపట్టినట్లు నాయకులు తెలిపారు.

ఈ సందర్భంగా అంగన్వాడీ రాష్ట్ర కార్యదర్శి కే. సమ్మక్క, రైతు సంఘం ములుగు జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి, ఆదివాసీ గిరిజన సంఘం ములుగు జిల్లా అధ్యక్షుడు దుగ్గి చిరంజీవి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తోందని ఆరోపించారు.

29 రకాల కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్‌ కోడ్లను తీసుకువచ్చిందని, వీటి ద్వారా కార్మికుల సమ్మె హక్కు, కనీస వేతనాల హక్కు తదితర హక్కులకు భంగం కలుగుతుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆరోపించారు.

స్వేచ్ఛా వాణిజ్యం పేరుతో అమెరికా, బ్రిటన్‌, న్యూజిలాండ్‌ దేశాల నుంచి వ్యవసాయ ఉత్పత్తులను సున్నా సుంకంతో దిగుమతి చేసుకునేందుకు అవకాశం కల్పించారని అన్నారు. అదే సమయంలో ఇతర దేశాలు భారత వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలు విధిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ విధానాలతో దేశ వ్యవసాయ రంగం దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి ‘వికసిత్‌ భారత్‌’ పేరుతో కొత్త పథకాన్ని తీసుకురావడం ద్వారా కేంద్ర ప్రభుత్వం నిధులను తగ్గించిందని నాయకులు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు సమకూర్చాల్సి రావడంతో అనేక రాష్ట్రాలు ఈ పథకానికి నిధులు సమకూర్చలేని పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు.

పాత విధానంలోనే ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని వారు డిమాండ్‌ చేశారు. కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.

రాస్తారోకో కారణంగా జాతీయ రహదారిపై సుమారు అరగంట పాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఇరువైపులా సుమారు కిలోమీటర్‌ మేర వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ధర్నాను విరమించాలని కోరారు. అనంతరం ఆందోళనకారులను అక్కడి నుంచి పంపించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.

ఈ కార్యక్రమంలో అల్లెం అశోక్‌, రైతు నాయకుడు ఓకే నాగేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు దాసరి కృష్ణ, అంగన్వాడీ జిల్లా నాయకురాలు రుక్మిణి, ఆశా నాయకురాలు భవన, నిర్మాణ కార్మిక సంఘం నాయకులు చిట్టినేని శ్రీనివాస్‌, ఎర్రోజు సత్యనారాయణ, అంగన్వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు పురెందుల సమ్మక్క, సరిత, రుక్మిణి, నిర్మలతో పాటు మండలంలోని అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, ఆశా కార్యకర్తలు, పీహెచ్‌సీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.