షార్జా ప్రమాద బాధితుడు సతీష్‌ను పరామర్శించిన విజిత్ కుమార్

కేటీఆర్ చొరవతో స్వదేశానికి చేరుకున్న సతీష్

దండెపల్లి, ఆంధ్రప్రభ: దండెపల్లి మండలంలోని నర్సాపూర్ గ్రామానికి చెందిన నరేడ్ల సతీష్ షార్జాలో ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు నడిపెల్లి విజిత్ కుమార్ స్పందించారు.

ఈ నెల 7న ఫోన్ ద్వారా బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి సతీష్ పరిస్థితిని తీసుకెళ్లారు. దీంతో కేటీఆర్ వెంటనే స్పందించి, ప్రమాదానికి గురైన సతీష్‌ను స్వదేశానికి తీసుకువచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.

కేటీఆర్ ఇచ్చిన మాట ప్రకారం శనివారం సతీష్‌ను షార్జా నుంచి స్వదేశానికి తీసుకురావడంలో చొరవ చూపారు. ఈ నేపథ్యంలో సోమవారం నర్సాపూర్‌లోని సతీష్ నివాసానికి వెళ్లిన నడిపెల్లి విజిత్ కుమార్ ఆయనను పరామర్శించారు.

సతీష్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. విజిత్ కుమార్‌ను చూసిన సతీష్ భావోద్వేగానికి గురయ్యారు. తనను స్వదేశానికి తీసుకురావడంలో సహకరించిన కేటీఆర్‌తో పాటు విజిత్ కుమార్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటానని సతీష్ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు చుంచు శ్రీనివాస్, నాయకులు గొల్లపల్లి అజయ్ గౌడ్, ఆశెట్టి వెంకటరమణ, గోళ్ల రాజమల్లు తదితరులు పాల్గొన్నారు.