అబ్కారీ శాఖ గౌడ కులస్తులపై దాడులు ఆపాలి

  • జై గౌడ ఉద్యమ జిల్లా అధ్యక్షుడు రంగోళ్ల మురళి గౌడ్ డిమాండ్

తాడ్వాయి, ఆంధ్రప్రభ: జిల్లా వ్యాప్తంగా గౌడ కులస్తులపై అబ్కారీ శాఖ నిర్వహిస్తున్న దాడులను వెంటనే నిలిపివేయాలని కామారెడ్డి జిల్లా జై గౌడ ఉద్యమ అధ్యక్షుడు రంగోళ్ల మురళి గౌడ్ డిమాండ్ చేశారు.

కల్లు కల్తీకి పాల్పడితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని, కానీ దాడుల పేరుతో గౌడ కులస్తులను భయభ్రాంతులకు గురి చేయడం సరికాదని ఆయన అధికారులకు సూచించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన హామీల మేరకు ప్రతి గ్రామంలో 5 ఎకరాల భూమిని ఈత వనాల పెంపకానికి కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈత వనాల అభివృద్ధికి ప్రభుత్వం అందించే రాయితీలు, భూములను వెంటనే కేటాయించాలని కోరారు.

ప్రతి సంవత్సరం అబ్కారీ శాఖ 50 వేల మొక్కలు నాటుతున్నట్లు ప్రకటిస్తోందని, ఆ మొక్కలు ఎక్కడ ఉన్నాయో చూపించాలని ప్రశ్నించారు. మద్యం మాఫియా ఇచ్చే మామూళ్లకు లొంగి గౌడ వృత్తిని నిర్వీర్యం చేసే చర్యలను మానుకోవాలని ఆయన అన్నారు.

గౌడ కులస్తులపై దాడులు కొనసాగితే జిల్లా వ్యాప్తంగా జై గౌడ ఉద్యమం ఆధ్వర్యంలో కల్లు దుకాణాలు మూసివేసి ఆందోళన చేపడతామని రంగోళ్ల మురళి గౌడ్ హెచ్చరించారు.