హెచ్‌ఎల్‌సీ ఆధునికీకరణలో జాప్యం..

  • రైతుల ప్రయోజనాలను ప్రభుత్వం దెబ్బతీస్తోంది: సీపీఐ

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : హెచ్ ఎల్ సి ఆధునీకరణ పనులు చేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తున్నదని జిల్లా సిపిఐ కార్యదర్శి నారాయణ స్వామివిమర్శించారు. నిత్యం కరువు పరిస్థితులతో అల్లాడుతున్న అనంతపురం జిల్లాలో సాగునీటి వనరులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవడంలో, ప్రభుత్వం విఫలమైందన్నారు. తుంగభద్ర ఎగువ కాలువ, గుంతకల్లు బ్రాంచ్ కాలువల ఆధునికీకరణ పనుల్లో జరుగుతున్న జాప్యంతో, రైతుల ప్రయోజనాలను పూర్తిగా దెబ్బ తీస్తోందన్నారు. ఆదివారం ఉరవకొండ మండలం నింబగల్లు గ్రామంవద్ద తుంగభద్ర ఎగువ కాలువ, గుంతకల్లు బ్రాంచ్ కాలువలు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి.

సీపీఐ నాయకులు కాలువలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్‌ఎల్‌సీ ఆధునికీకరణ పనులు కర్ణాటక ప్రాంతంలో పూర్తి అయ్యాయి. కానీ ఆంధ్రాలో మాత్రం పనులు చేపట్ట కుండా ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నదని ఆరోపించారు. హెచ్‌ఎల్‌సీ ని పూర్తి స్థాయిలో ఆధునికీకరిస్తే, సుమారు 4 వేల క్యూసెక్కుల నీటిని సమర్థవంతంగా వినియోగిం చుకునే అవకాశం ఉందన్నారు. కాలువ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు రెగ్యులేటర్లు, తూము లు, ఇతర కీలక నిర్మాణాల కు మరమ్మతులు చేపడితే నీటి వృథాను అరికట్టి, ఆయకట్టు చివరి భూముల భూములకు సాగునీరు అందించవచ్చన్నారు.

ప్రస్తుతం తుంగభద్ర డ్యామ్‌కు వరద ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో హెచ్‌ఎల్‌సీ, జీబీసీ ఆయ కట్టు రైతులకు పూర్తి స్థాయి లో సాగునీరు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాలువల శిథిలావస్థ కారణంగా నీటి విడుదల సమయంలో లీకేజీలు, ఇతర సమస్యల తో నీరు వృథా అవుతోందన్నారు. అలాగే హంద్రీనీవా కాలువ ద్వారా 6,300 క్యూసెక్కుల నీటిని తీసుకురావాలని, ఉరవకొండ నియోజకవర్గం లో సామూహిక బిందు సేద్యం ప్రాజెక్టును పూర్తి చేసి 50 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.

వర్షాభావ పరిస్థితులతో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించి, రైతులకు తగిన ఉపశమనం కల్పించాలన్నారు.సాగునీటి ప్రాజెక్టులు, కాలువల ఆధునికీకరణపై ప్రభుత్వం నిర్లక్ష్యం కొనసాగిస్తే రైతులను ఐక్యం చేసి సీపీఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు కేశవరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు మల్లికార్జున, సుల్తాన్, నాగేంద్ర, బసవరాజు, హషేన్‌బాషా, గన్నే మల్లేష్, ప్రజానాట్య మండలి నాయకులు కుల్లాయప్ప తదితరులు పాల్గొన్నారు.