కూటమికి జనం బ్రహ్మరథం.. జగన్ పాలనకు చరమగీతం
- ఉత్సాహంగా ఇంటింటికీ తెలుగుదేశం
- ప్రజల నుంచి అపూర్వ స్పందన
- కూటమి పాలనతో ప్రజలు గుండెపై చేయి వేసుకుని ప్రశాంతంగా నిద్రపోతున్నారు…
- మోదీ,చంద్రబాబు,పవన్,లోకేశ్ నాయకత్వంలో 30 ఏళ్ల పాలన ఖాయం
- పశ్చిమలో ‘ఇంటింటికీ తెలుగుదేశం’ 50 శాతం పూర్తి
- ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూటమిదే విజయం..
- పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి బుద్దా వెంకన్న
( భవానిపురం, ఆంధ్రప్రభ ) : కూటమి ప్రభుత్వానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గుండెపై చేయి వేసుకుని ప్రశాంతంగా నిద్రపోతున్నామని చెబుతున్నారని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి బుద్ధా వెంకన్న అన్నారు. పశ్చిమ నియోజకవర్గం 48వ డివిజన్ అధ్యక్షుడు బెవరా జోగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా బుద్ధా వెంకన్న మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో సానుకూల స్పందన కనిపిస్తోందన్నారు.
ప్రతి ఇంటికీ వెళ్లినప్పుడు ప్రజలు ఆనందంగా ఉన్నామని చెబుతున్నారని, గత ప్రభుత్వ పాలనలో ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచి విముక్తి లభించిందని పేర్కొంటున్నారని తెలిపారు. ప్రజల నుంచి లభిస్తున్న ఈ ఆదరణ కూటమి ప్రభుత్వంపై ఉన్న విశ్వాసానికి నిదర్శనమన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం సుదీర్ఘకాలం కొనసాగుతుందని బుద్ధా వెంకన్న ధీమా వ్యక్తం చేశారు. 15 ఏళ్ల పాలన కాదని, 30 ఏళ్ల వరకు కూటమి ప్రభుత్వం కొనసాగించేలా ప్రజల మద్దతు ఉందన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, అమలు చేస్తున్న విధానాల పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని చెప్పారు.

పశ్చిమ నియోజకవర్గంలో చేపట్టిన ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమం ఇప్పటికే 50 శాతం పూర్తయిందని వెంకన్న తెలిపారు. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలను కలుసుకుంటూ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించడంతో పాటు ప్రజల సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకుంటున్నామని అన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల స్పందనను చూస్తుంటే ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూటమి విజయం ఖాయమని ప్రజలే చెబుతున్నారని పేర్కొన్నారు. ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలను తెలుసుకోవడం, ప్రభుత్వ పాలనపై వారి అభిప్రాయాలను సేకరించడం ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని బుద్ధా వెంకన్న అన్నారు.
పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు సమష్టిగా పనిచేస్తూ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో నూర్భాషా కార్పొరేషన్ అండ్ డెవలప్మెంట్ చైర్మన్ కె. నాగుల్ మీరా, రాష్ట్ర అధికార ప్రతినిధి, గ్రంథాలయ చైర్మన్ ఎం.ఎస్. బేగ్, టీడీపీ కార్యదర్శి గొల్లవిల్లి నరసింహారావు, గుర్రం కొండ, మద్దినేని చెంచయ్యచౌదరి, పిల్ల బంగారయ్య, సీతా పార్వతి, చక్కర, లక్ష్మణరావు, గూడేల శ్రీనివాసరావు, రాళ్లపూడి మాధవ్, కొరికాని మల్లేశ్వరరావు, పిల్ల శ్రీనివాసరావు, పీసీ బంక జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
