చెంగల్‌లో శివాజీ విగ్రహ ఏర్పాటుకు స్థల పరిశీలన

భీమ్‌గల్‌ రూరల్, ఆంధ్రప్రభ: భీమ్‌గల్‌ మండలం చెంగల్‌ గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటుకు స్థల పరిశీలన చేపట్టారు. ఈ మేరకు మోర్తాడ్‌ ప్రజా నిలయంలో కాంగ్రెస్‌ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇన్‌చార్జి ముత్యాల సునీల్‌కుమార్‌ను మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు దుమాల రాజు, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ నర్సాపురం జీవన్‌ కలిసి విగ్రహ ఏర్పాటుకు అనుమతి ఇప్పించాలని కోరారు. దీనిపై సునీల్‌కుమార్‌ సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి అనుమతులు వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం చెంగల్‌ గ్రామానికి చేరుకున్న సునీల్‌కుమార్‌ విగ్రహం ఏర్పాటు చేయనున్న స్థలాన్ని పరిశీలించారు. విగ్రహ ఏర్పాటుకు అవసరమైన అనుమతులు, స్థలానికి సంబంధించిన అంశాలను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీంతో గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహ ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు.