ప్రజా సమస్యల పరిష్కారానికి అండగా ఉంటా

మంథన్‌గోడ్‌లో మినీ వాటర్‌ ట్యాంక్‌ ప్రారంభం

మక్తల్, ఆంధ్రప్రభ: ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా అండగా ఉంటానని సామాజికవేత్త, బీఆర్‌ఎస్‌ నాయకుడు ఉప్పరి అశోక్‌ సాగర్‌ అన్నారు. మక్తల్‌ మండలం మంథన్‌గోడ్‌ గ్రామంలోని కురువగేరిలో సొంత నిధులతో ఏర్పాటు చేసిన బోరు మోటారు, మినీ వాటర్‌ ట్యాంకును ఆదివారం స్థానికులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కురువగేరి ప్రజలు చాలాకాలంగా ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను తన దృష్టికి తీసుకురాగానే బోరు మోటారు ఏర్పాటు చేశానన్నారు. అయితే బోరు మోటారుతో నీటి వృథా జరుగుతోందని స్థానికులు చెప్పడంతో మినీ వాటర్‌ ట్యాంకు నిర్మించాలని నిర్ణయించి పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రజలకు తాగునీటి సదుపాయం కల్పించడం తనకు ఎంతో సంతృప్తినిస్తోందన్నారు. గతంలోనూ అనేక సేవా కార్యక్రమాలు చేపట్టానని, పాఠశాల విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు కృషి చేశానని తెలిపారు.

గ్రామంలో ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని అశోక్‌ సాగర్‌ హామీ ఇచ్చారు. సేవ చేసే అవకాశం కల్పించిన మంథన్‌గోడ్‌ గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. ఉప సర్పంచ్‌ సాబెన్న, వీధి పెద్దలు మాట్లాడుతూ తాగునీటి సమస్య పరిష్కారానికి బోరు మోటారుతో పాటు మినీ వాటర్‌ ట్యాంకును ఏర్పాటు చేసిన అశోక్‌ సాగర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. గతంలోనూ తమ ప్రాంతానికి పలు విధాలుగా సహాయ సహకారాలు అందించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు నరేందర్‌రెడ్డి, సుదర్శన్‌గౌడ్‌, మల్లికార్జున్‌గౌడ్‌, సత్యరెడ్డి, ఆశప్ప, నరేందర్‌గౌడ్‌, పూజారి కాకప్ప, కురువ హనుమంతు, కురువ రమేష్‌, పెద్ద లింగప్ప, కురువ నరెప్ప, కురువ కాకెప్ప, బోడి మల్లేష్‌, ప్రవీణ్‌గౌడ్‌, ఎం.రాజు, కురువ శేఖర్‌, మల్లేష్‌, ఉప్పరి ఆంజనేయులు, రాకేష్‌, హోటల్‌ నరేందర్‌, పాండు, కోరి రాములు, గువ్వల తిరుపతి, ఎస్‌.రమేష్‌, బీఆర్‌ఎస్‌ సామాజిక మాధ్యమాల సమన్వయకర్త తుమ్మలంపు సురేష్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.