కొరియా మాస్టర్స్‌లో అశ్మిత సంచలనం..
సియోల్, ఆంధ్రప్రభ : భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అశ్మిత చలిహా తొలిసారి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన కొరియా మాస్టర్స్ మహిళల సింగిల్స్ ఫైనల్లో చైనాకు చెందిన నాలుగో సీడ్ హాన్ కియాన్ షీపై అశ్మిత 14-21, 21-14, 21-14తో విజయం సాధించింది. 53 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో తొలి గేమ్ కోల్పోయినప్పటికీ.. అశ్మిత అద్భుతంగా పుంజుకుని వరుసగా రెండు గేమ్‌లు గెలిచి టైటిల్‌ను దక్కించుకుంది.
నిర్ణాయత్మక మూడో గేమ్‌లో మధ్యంతర విరామ సమయానికి అశ్మిత 9-11తో వెనుకబడింది. అయితే కోర్టు మరోవైపు నుంచి అనుకూలంగా వీస్తున్న గాలి పరిస్థితులను చక్కగా ఉపయోగించుకున్న ఆమె.. మిగిలిన 15 పాయింట్లలో 12 పాయింట్లు సాధించి మ్యాచ్‌ను తన ఖాతాలో వేసుకుంది.
గాయం నుంచి తిరిగి.. టైటిల్ వరకు
గువాహటికి చెందిన 26 ఏళ్ల అశ్మిత మూడు నెలల గాయం విరామం అనంతరం మేలో బీడబ్ల్యూఎఫ్ టూర్‌లోకి తిరిగి వచ్చింది. పునరాగమనం తర్వాత తొలి రెండు టోర్నీల్లోనే చైనా మాస్టర్స్, మలేసియా మాస్టర్స్‌లో క్వార్టర్‌ఫైనల్ వరకు చేరింది. జూన్‌లో జరిగిన మకావు ఓపెన్‌లో సెమీఫైనల్ చేరడం ఈ సీజన్లో ఆమెకు టైటిల్‌కు ముందు అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది.
కొరియా మాస్టర్స్‌లో అశ్మిత టాప్ సీడ్ హినా అకేచిని క్వార్టర్ఫైనల్లో ఓడించగా.. సెమీఫైనల్లో స్వదేశానికి చెందిన రక్షిత రామ్‌రాజ్‌పై విజయం సాధించింది. గువాహటిలోని నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పార్క్ టే-సాంగ్ వద్ద ఆమె శిక్షణ పొందుతోంది.
కొరియా మాస్టర్స్ టైటిల్‌తో భారత్ మహిళల సింగిల్స్‌లో వరుసగా రెండో బీడబ్ల్యూఎఫ్ టూర్ టైటిల్‌ను సాధించింది. గత వారం తైపీ ఓపెన్‌లో తన్వీ శర్మ విజేతగా నిలిచింది. అశ్మితతో పాటు సైనా నెహ్వాల్, పీవీ సింధు, దేవికా సిహాగ్ మాత్రమే మహిళల సింగిల్స్‌లో బీడబ్ల్యూఎఫ్ టూర్ టైటిల్స్ సాధించిన భారత క్రీడాకారిణుల జాబితాలో ఉన్నారు.
