భక్తుల మనసు గెలుచుకున్న అమ్మ సన్నిధి..
- వరుసగా రెండో నెలా రాష్ట్రంలో నంబర్ వన్!
- భక్తుల సంతృప్తిలో కనకదుర్గమ్మ సన్నిధికి అగ్రపీఠం
- జూలైలో 74 శాతం.. ఆగస్టులో 75.3 శాతం
- ఒక్క నెలలోనే 1.3 శాతం మెరుగైన సేవా ప్రమాణాలు
- ఏడు ప్రముఖ ఆలయాల పనితీరులో విజయవాడకే అగ్రస్థానం
- మిగిలిన ఆరు ఆలయాల్లో తగ్గిన సంతృప్తి..
- ఇంద్రకీలాద్రిలో మాత్రం వృద్ధి
- భక్తుల మాటే కొలమానంగా..
- సేవల మెరుగుదలకు నిరంతర పర్యవేక్షణ
( ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ ) : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి సన్నిధిలో భక్తిసేవకు మరో అరుదైన గుర్తింపు లభించింది. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు అందుతున్న సౌకర్యాలు, సేవలపై స్వయంగా భక్తుల నుంచి సేకరిస్తున్న అభిప్రాయాల్లో విజయవాడ దుర్గగుడి వరుసగా రెండో నెల కూడా రాష్ట్రంలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల సేవలపై ప్రభుత్వం నిర్వహిస్తున్న భక్తుల అభిప్రాయ సేకరణలో జూలైలో 74 శాతం సానుకూల స్పందన సాధించిన ఇంద్రకీలాద్రి, ఆగస్టులో మరింత మెరుగుపడి 75.3 శాతానికి చేరుకుంది. అంటే ఒక్క నెల వ్యవధిలోనే మరో 1.3 శాతం వృద్ధి నమోదు చేసింది. ఇదే సమయంలో పోలికలో ఉన్న మిగిలిన ఆరు ప్రముఖ ఆలయాల్లో సానుకూల స్పందన తగ్గడం ఇంద్రకీలాద్రి సేవా ప్రమాణాల ప్రత్యేకతను చాటుతోంది.
భక్తులే తీర్పు.. సేవలే కొలమానం…
ఆలయాల్లో భక్తులకు అందుతున్న సేవలను కేవలం అధికారుల నివేదికలతో కాకుండా, భక్తుల ప్రత్యక్ష అనుభవం ఆధారంగా అంచనా వేయాలన్న విధానంలో భాగంగా ప్రభుత్వం ఐవీఆర్‌ఎస్ ద్వారా అభిప్రాయాలను సేకరిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రముఖ దేవాలయాల్లో భక్తులకు అందుతున్న సేవలు సంతృప్తిపై ప్రతినెల రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సర్వే నిర్వహిస్తోంది.
వరుస రెండు నెలలు అగ్రభాగమే..
విజయవాడ దుర్గగుడిపై జూలైలో వెలువడిన నివేదికలోనూ దర్శనం, తాగునీరు, ప్రసాదాల నాణ్యత, పరిశుభ్రత వంటి కీలక అంశాలపై భక్తుల స్పందనను పరిగణనలోకి తీసుకున్నట్లు వెల్లడైంది. జూలైలో దుర్గగుడికి 74 శాతం సానుకూల స్పందన లభించగా, ఆ సమయంలో రాష్ట్రంలోని ఇతర ప్రధాన ఆలయాల కంటే ముందంజలో నిలిచింది. ఆగస్టులో విజయవాడ దుర్గగుడి 75.3 శాతం సానుకూల స్పందనతో అగ్రస్థానంలో ఉంది. జూలైలో 74 శాతంగా ఉన్న స్కోరు 75.3 శాతానికి పెరగడంతో +1.3 శాతం వృద్ధి నమోదైంది. ద్వారకా తిరుమల 71.4 శాతం, శ్రీకాళహస్తి 69.2, అన్నవరం 69, కాణిపాకం 67.8, సింహాచలం 67.3, శ్రీశైలం 67 శాతం సానుకూల స్పందనతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

అంటే ఆగస్టులో రెండో స్థానంలో ఉన్న ద్వారకా తిరుమలతో పోలిస్తే కూడా ఇంద్రకీలాద్రికి 3.9 శాతం పాయింట్ల ఆధిక్యం ఉంది. ఇంద్రకీలాద్రి పనితీరును మరింత స్పష్టంగా చూపుతున్న గణాంకాల ప్రకారం శ్రీకాళహస్తి 69.4 నుంచి 69.2కి (-0.2), అన్నవరం 69.9 నుంచి 69కి (-1.0), ద్వారకా తిరుమల 72.4 నుంచి 71.4కి (-1.0), శ్రీశైలం 68 నుంచి 67కి (-1.1), కాణిపాకం 69.9 నుంచి 67.8కి (-2.0), సింహాచలం 69.7 నుంచి 67.3కి (-2.4) తగ్గాయి. అదే సమయంలో విజయవాడ దుర్గగుడి మాత్రం 74 నుంచి 75.3 శాతానికి పెరిగింది. అంటే పోలికలోని ఏడు ఆలయాల్లో ఆగస్టులో సానుకూల స్పందన పెరిగిన ఏకైక ఆలయంగా ఇంద్రకీలాద్రి నిలిచింది..
పెరిగిన సేవా ప్రమాణాలు…

ఇంద్రకీలాద్రి కేవలం ఆధ్యాత్మిక క్షేత్రంగానే కాకుండా, భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే ప్రముఖ పుణ్యక్షేత్రంగా కొనసాగుతోంది. వేసవి, పౌర్ణమి, ఆషాఢ మాసం వంటి సందర్భాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనానికి తరలివస్తున్న నేపథ్యంలో క్యూల నిర్వహణ, తాగునీరు, పారిశుద్ధ్యం, ప్రసాదాల సరఫరా, దర్శన ఏర్పాట్లు వంటి అంశాలు దేవస్థాన నిర్వహణకు నిరంతర సవాలుగా ఉంటాయి. భారీ రద్దీ సమయంలోనూ భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్న దేవస్థానం అధికారులు ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల దేవస్థానంలో డిజిటల్ సేవల విస్తరణ, దర్శనం,ప్రసాదం టికెట్లకు సాంకేతిక సదుపాయాలు, నగదు రహిత చెల్లింపులు, ప్రత్యేక సహాయ కేంద్రాలు వంటి చర్యలు చేపట్టారు, కియోస్క్‌ల ద్వారా దర్శనం, సేవా టికెట్లు, లడ్డూలు తదితర సేవలను పొందే అవకాశం కల్పించడం ద్వారా క్యూల ఒత్తిడిని తగ్గించే ప్రయత్నాలు కూడా జరిగాయి.
సేవల్లో లోపాలు సవరించుకుంటూ…
ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనం కోసం నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుండగా, రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సదుపాయాలు, క్యూల నిర్వహణ, ప్రసాదాల నాణ్యత, డిజిటల్ సేవలు వంటి అంశాలపై దేవస్థానం దృష్టి సారిస్తోంది. భక్తుల సంతృప్తిని నిరంతరం తెలుసుకుని లోపాలను సరిదిద్దే విధానం సేవల నాణ్యతను మెరుగుపరుస్తున్నారు.
అమ్మవారి సన్నిధికి వచ్చే భక్తుడి సంతృప్తినే సేవకు ప్రామాణికంగా తీసుకున్న ఇంద్రకీలాద్రి.. గణాంకాల్లోనూ అదే విశ్వాసాన్ని సంపాదిస్తోంది. జూలైలో 74 శాతంతో అగ్రస్థానం అధిరోహించిన దుర్గగుడి, ఆగస్టులో 75.3 శాతానికి ఎదిగి తన స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకుంది. రాష్ట్రంలోని ఇతర ప్రముఖ పుణ్యక్షేత్రాలు వెనకడుగు వేస్తున్న సమయంలో ఇంద్రకీలాద్రి మాత్రం ముందడుగు వేయడం.. అమ్మవారి సేవలో విజయవాడ దుర్గగుడి నిర్వహణకు భక్తుల నుంచి లభిస్తున్న ప్రత్యక్ష ప్రశంసకు ప్రతిబింబంగా నిలిచింది.
