ఆదివాసీలు ప్రకృతి పరిరక్షకులు.. విభిన్న సంస్కృతికి ప్రతీకలు

  • ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్
  • ఆదివాసీల సేవలు, పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: కేటీఆర్

హైదరాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : ఆదివాసీలు ప్రకృతి పరిరక్షకులని, విభిన్న సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీ సోదర సోదరీమణులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అడవులు, చెట్లు, పుట్టలు, జంతువులను ప్రేమిస్తూ, పూజిస్తూ ప్రకృతితో మమేకమై జీవించే ఆదివాసీలు.. ‘జల్‌, జంగల్‌, జమీన్‌’ అంటూ పోరాడిన కుమ్రం భీం తెగువకు ప్రతిరూపాలని కేటీఆర్‌ పేర్కొన్నారు.

ఎస్టీల అభ్యున్నతి కోసం తమ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని ఆయన తెలిపారు. ఎస్టీ రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి, అనంతరం ఉత్తర్వులు జారీ చేసినట్లు గుర్తుచేశారు. తండాలు, గిరిజన గూడేలను గ్రామ పంచాయతీలుగా మార్చినట్లు పేర్కొన్నారు.

హైదరాబాద్‌ నడిబొడ్డున బంజారాహిల్స్‌లో ఆదివాసీ ఆత్మగౌరవాన్ని చాటేలా కుమ్రం భీం ఆదివాసీ భవన్‌ను నిర్మించినట్లు కేటీఆర్‌ తెలిపారు. ఆసిఫాబాద్‌ జిల్లాకు కుమ్రం భీం పేరు పెట్టడంతో పాటు జోడేఘాట్‌లో స్మృతివనాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

తండాలు, గూడేలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడం, ఎస్టీ గురుకులాలు, కళాశాలల సంఖ్యను పెంచడం, అంబేద్కర్‌ ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ అందించడం, సీఎంఎస్టీఈఐ పథకం ద్వారా గిరిజన యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం వంటి కార్యక్రమాలను తమ ప్రభుత్వం చేపట్టిందని ఆయన వివరించారు.

ప్రకృతిని కాపాడుతూ తమ ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాలను తరతరాలకు అందిస్తున్న ఆదివాసీల సేవలు, పోరాట స్ఫూర్తి చిరస్మరణీయమని కేటీఆర్‌ పేర్కొన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీ సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.