అడవులే ఆదివాసీలకు రక్షణ కవచం..

  • అడవులను కాపాడుతున్న గిరిజనుల సేవలకు పవన్‌ కల్యాణ్‌ అభినందనలు
  • గిరిజనుల సంక్షేమానికి ‘అడవి తల్లి బాట’ వంటి కార్యక్రమాలు

అమరావతి, ఆంధ్రప్రభ : అడవులు తరతరాలుగా గిరిజన సమాజాలకు రక్షణగా నిలుస్తున్నాయని, అదే సమయంలో గిరిజనులు అడవులను ప్రకృతి, సంస్కృతి, ప్రాచీన జ్ఞానానికి సంరక్షకులుగా కాపాడుతున్నారని ఉప ముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివారం ఎక్స్ వేదికగా రాష్ట్రంలోని గిరిజన సోదర, సోదరీమణులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఆదివాసీల సంప్రదాయ జ్ఞానం, సంస్కృతి, వారసత్వ పరిరక్షణలో గిరిజన మహిళలు, సమాజాల పాత్ర ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

సందర్భంగా ‘స్వదేశీ మంత్రసానులను గౌరవించడం–జీవితం, ఆరోగ్య సంరక్షణ’ అనే అంశాన్ని గుర్తు చేశారు. తరతరాలుగా అందుతున్న సంప్రదాయ జ్ఞానం సమాజానికి విలువైన వారసత్వమని తెలిపారు. గిరిజనులతో తనకు ఉన్న అనుబంధం వ్యక్తిగతంగా ఎంతో ప్రత్యేకమైనదని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. వారి అభిమానం, నమ్మకం గిరిజనుల గౌరవం, సంక్షేమం కోసం మరింత బాధ్యతగా పనిచేయాలనే సంకల్పాన్ని బలపరుస్తున్నాయని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తున్నామని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు.

‘అడవి తల్లి బాట’ వంటి కార్యక్రమాలతో పాటు మారుమూల గిరిజన ఆవాసాలకు మెరుగైన రహదారి, రవాణా అనుసంధానం కల్పించడం, జీవనోపాధి అవకాశాలను పెంచడం, అడవులు, వన్యప్రాణులకు మరింత రక్షణ కల్పించడం వంటి చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. అభివృద్ధి ప్రతి గిరిజన కుటుంబానికి చేరేలా చర్యలు తీసుకుంటూనే వారి ప్రత్యేక గుర్తింపు, సంప్రదాయాలు, సంస్కృతి పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు. గిరిజనుల నమ్మకం ప్రభుత్వంపై ఉన్న బాధ్యత అని, వారి వారసత్వం రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్నారు.

గౌరవం.. అవకాశాలు.. భద్రత

ప్రతి గిరిజన కుటుంబం గౌరవంతో, అవకాశాలతో, భద్రతతో, ఆశావహ భవిష్యత్తుతో జీవించేలా కలిసి ముందుకు సాగాల్సిన అవసరం ఉందని పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు. గిరిజనుల అభివృద్ధి, వారి సంస్కృతి, అడవుల పరిరక్షణ పరస్పరం అనుసంధానమైన అంశాలని ఆయన సందేశం స్పష్టం చేస్తోంది.