మహిళను సజీవంగా దహనం చేశారా?
రామక్కపేట శివారులో గుర్తుతెలియని మహిళ దగ్ధ మృతదేహం
కాళ్లకు వెండి మట్టెలు.. ఘటనపై పోలీసుల దర్యాప్తు
దుబ్బాక, ఆంధ్రప్రభ: అమానవీయ ఘటన.. అత్యంత దారుణంగా ఓ మహిళను దహనం చేసి శివారులో పడేసిన ఘటన సిద్దిపేట జిల్లాలో కలకలం రేపింది. దుబ్బాక మండలం రామక్కపేట గ్రామ శివారులో ఆదివారం గుర్తుతెలియని మహిళ దగ్ధ మృతదేహం కనిపించింది. కొంచెం కురచగా ఉన్న మహిళపై పెట్రోల్ పోసి దహనం చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి కాళ్లకు వెండి మట్టెలు ఉండటంతో ఆమె వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలను సేకరించారు.
సంచలనం సృష్టించిన ఘటనపై సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాళ్, ఏసీపీ రవీందర్‌రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డితో పాటు పలువురు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మహిళను ఎవరు, ఎందుకు దహనం చేశారన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని ఏసీపీ తెలిపారు. మహిళను గుర్తించడంతో పాటు ఈ దారుణానికి పాల్పడిన వారిని పట్టుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.
