భీమ్‌గల్‌లో కొలిక్కిరాని కో-ఆప్షన్‌ ఎంపిక

ఆరు నెలలైనా ముందుకు సాగని ప్రక్రియ.. వర్గపోరే కారణమా?
ఇతర మున్సిపాలిటీల్లో పూర్తయినా.. ఇక్కడ మాత్రం జాప్యం

భీమ్‌గల్‌ టౌన్, ఆంధ్రప్రభ: భీమ్‌గల్‌ మున్సిపల్‌ పాలకవర్గంలో కో-ఆప్షన్‌ సభ్యుల ఎంపిక ప్రక్రియ ఇంకా కొలిక్కిరాకపోవడం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్‌ ఎన్నికలు ముగిసి సుమారు ఆరు నెలలు కావస్తున్నా కో-ఆప్షన్‌ సభ్యుల ఎంపిక పూర్తికాకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీల్లో ఇప్పటికే కో-ఆప్షన్‌ సభ్యుల ఎంపిక ప్రక్రియ పూర్తయినప్పటికీ భీమ్‌గల్‌లో మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పరిస్థితి ఉంది. మున్సిపాలిటీలో మొత్తం 12 మంది కౌన్సిలర్లు ఉండగా.. కాంగ్రెస్‌కు చెందిన వారు 8 మంది, బీఆర్‌ఎస్‌కు చెందిన వారు నలుగురు ఉన్నారు. వీరితో పాటు నిబంధనల ప్రకారం నలుగురు కో-ఆప్షన్‌ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంది. ఒక బీసీ మహిళ, ఒక మైనారిటీ ప్రతినిధి, ఒక బీసీ ప్రతినిధి, ఒక ఎస్సీ ప్రతినిధిని ఎంపిక చేయాల్సి ఉంది. ఫిబ్రవరిలో మున్సిపల్‌ ఎన్నికలు పూర్తయ్యాయి. ఎన్నికల అనంతరం నిర్ణీత గడువులోనే కో-ఆప్షన్‌ సభ్యుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ.. ఇప్పటివరకు ఆ దిశగా అడుగు పడలేదు. ప్రభుత్వం ఎంపికకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదల చేసినా ప్రక్రియ ముందుకు సాగకపోవడం విమర్శలకు తావిస్తోంది.

వర్గపోరే అడ్డంకిగా మారిందా? కో-ఆప్షన్‌ సభ్యుల ఎంపిక విషయంలో అధికార కాంగ్రెస్‌లో నెలకొన్న అంతర్గత వర్గపోరే జాప్యానికి కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కో వర్గం తమకు అనుకూలమైన వ్యక్తులకు అవకాశం కల్పించాలని పట్టుబడుతుండటంతో ఏకాభిప్రాయం కుదరడం లేదనే చర్చ స్థానికంగా జరుగుతోంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి స్పష్టత వెలువడలేదు. కో-ఆప్షన్‌ సభ్యుల పదవులకు పలువురు ఆశావహులు ఆసక్తి చూపుతుండటంతో ఎవరికి అవకాశం దక్కుతుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించే ఈ పదవుల ఎంపికను రాజకీయ విభేదాల కారణంగా మరింత ఆలస్యం చేయకుండా నిబంధనల ప్రకారం పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకత్వం జోక్యం చేసుకుని స్థానికంగా నెలకొన్న విభేదాలను పరిష్కరించాలని సూచిస్తున్నారు. ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసినప్పటికీ ప్రక్రియ పూర్తి కాకపోవడం, ఎన్నికల అనంతరం చేపట్టాల్సిన కీలక ప్రక్రియలు సకాలంలో పూర్తికాకపోవడం పట్ల ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇకనైనా భీమ్‌గల్‌ మున్సిపల్‌ కో-ఆప్షన్‌ సభ్యుల ఎంపికకు ఉన్న అడ్డంకులను తొలగించి ప్రక్రియను పూర్తి చేస్తారా? లేక మరికొంత కాలం జాప్యం కొనసాగుతుందా? అన్నది వేచి చూడాల్సి ఉంది.