రేషన్‌ బియ్యం అక్రమ రవాణా.. బొలెరో పట్టివేత

  • 32 బ్యాగుల్లో 15 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం.. వాహనం సీజ్
  • డ్రైవర్‌ కం ఓనర్‌పై కేసు.. ఇదే వాహనంపై గతంలోనూ కేసు

అచ్చంపేట, ఆంధ్రప్రభ : పేదలకు ప్రభుత్వం అందించే రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న బొలెరో వాహనాన్ని అచ్చంపేట పోలీసులు పట్టుకున్నారు. వాహనంలో 32 బ్యాగుల్లో తరలిస్తున్న 15 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని, వాహనాన్ని సీజ్‌ చేశారు. డ్రైవర్‌ కం ఓనర్‌ తిక్కల శ్రీకాంత్‌పై కేసు నమోదు చేసినట్లు అచ్చంపేట ఎస్‌ఐ బి.నరేష్‌ తెలిపారు.

విశ్వసనీయ సమాచారం మేరకు శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అచ్చంపేట శివారు ప్రాంతంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా వెళ్తున్న టీఎస్‌ 31 టీఏ 2726 నంబరు గల మహేంద్ర బొలెరో వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా అందులో రేషన్‌ బియ్యం ఉన్నట్లు గుర్తించారు.

32 బ్యాగుల్లో 15 క్వింటాళ్లు

శనివారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీటీ హేమ్లా నాయక్‌ సమక్షంలో పంచనామా నిర్వహించారు. వాహనంలో 32 బ్యాగుల్లో మొత్తం 15 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం ఉన్నట్లు నిర్ధారించారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని అచ్చంపేట పట్టణంలోని ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ గోదాంకు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు. బొలెరో వాహనాన్ని సీజ్‌ చేసి, డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

ఇదే వాహనంపై గతంలోనూ కేసు

ఇదే బొలెరో వాహనం గతంలోనూ రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తూ పట్టుబడిందని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీటీ హేమ్లా నాయక్‌ తెలిపారు. సుమారు ఏడాది క్రితం ఈ వాహనంపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. అయినప్పటికీ మళ్లీ అదే వాహనం అక్రమ రవాణాలో పట్టుబడటంపై అధికారులు దృష్టి సారించారు.

సూత్రధారులను గుర్తించాలి

అచ్చంపేట పట్టణంలో రేషన్‌ బియ్యం అక్రమ రవాణా కొనసాగుతోందంటూ స్థానికంగా విమర్శలు వినిపిస్తున్నాయి. వ్యక్తులను మారుస్తూ అక్రమ దందాను కొనసాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పేదలకు అందాల్సిన రేషన్‌ బియ్యం పక్కదారి పట్టకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అక్రమ రవాణా వెనుక ఉన్న అసలు సూత్రధారులను గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.