సోలార్ భూసేకరణపై రైతుల గళం…

రైతులకు అన్యాయం జరగనివ్వం..
సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం
బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు యస్. విష్ణువర్ధన్ రెడ్డి భరోసా


కదిరి, ఆగస్టు 8 (ఆంధ్రప్రభ): నంబులపూలకుంట మండలంలో ప్రతిపాదిత సోలార్ ప్రాజెక్టు భూసేకరణ వ్యవహారంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు అండగా నిలుస్తామని బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు యస్.విష్ణువర్ధన్ రెడ్డి హామీ ఇచ్చారు. సోలార్ ప్రాజెక్టు కోసం ప్రతిపాదించిన భూముల విషయంలో తమ అభ్యంతరాలు, న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన సుమారు 200 మంది రైతులు శనివారం కదిరిలో ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు.

నంబులపూలకుంట మండల పరిధిలో సోలార్ ప్రాజెక్టు కోసం సుమారు 16 వేల ఎకరాల భూసేకరణ ప్రతిపాదనతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా మర్రికొమ్మదిన్నె గ్రామ పంచాయతీ పరిధిలోని రైతులు తమ భూములకు సంబంధించిన సమస్యలను విష్ణువర్ధన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. భూసేకరణ ప్రక్రియతో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు, భూములపై ఉన్న అభ్యంతరాలు, న్యాయపరమైన అంశాలను వివరించారు.

రైతుల గోడు విన్న నేత…
రైతులు వివరించిన సమస్యలను విష్ణువర్ధన్ రెడ్డి సానుకూలంగా విన్నారు. రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా ప్రభుత్వం, సంబంధిత అధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అవసరమైన సహాయ సహకారాలు అందేలా అధికారులతో సమన్వయం చేస్తానని తెలిపారు.

న్యాయబద్ధమైన పరిష్కారం రావాలి…
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోలార్ ప్రాజెక్టు అభివృద్ధి కార్యక్రమమైనప్పటికీ, దాని కోసం భూములు కోల్పోతున్న రైతుల అభ్యంతరాలు, ఆందోళనలను ప్రభుత్వం తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. రైతులకు న్యాయబద్ధమైన పరిష్కారం లభించేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

రైతులు తమ సమస్యలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారి తరఫున ప్రభుత్వంతో మాట్లాడి సమస్య పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని విష్ణువర్ధన్ రెడ్డి భరోసా ఇచ్చారు. భూసేకరణ ప్రక్రియలో రైతుల ప్రయోజనాలకు భంగం కలగకుండా, న్యాయం జరిగేలా సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు రాజేశ్, తిమ్మారెడ్డి, ఉత్తమరెడ్డి, సుదర్శన్, కోటగుల వెంకటేష్, బీజేపీ మండల అధ్యక్షుడు బాబాజాన్, తిరుమలనాయుడు, ఖాదర్‌వలి, వెంకటేష్, నాగేష్ తదితరులు పాల్గొన్నారు.