స్వాతంత్ర్య వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు…

పరేడ్, భద్రత, ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి
ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలతో శకటాలు, స్టాళ్లు
విద్యుత్, తాగునీరు, పారిశుధ్యం, మౌలిక వసతులకు ప్రాధాన్యం


తిరుపతి (ఆంధ్రప్రభ): జిల్లాలో ఆగస్టు 15న నిర్వహించనున్న 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా, క్రమబద్ధంగా, ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు, ఇన్‌చార్జి మున్సిపల్ కమిషనర్ శారదాదేవి, జిల్లా రెవెన్యూ అధికారి జి.నరసింహులు, ఇతర జిల్లా అధికారులతో జూమ్‌ కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సంబంధించి వివిధ శాఖలకు అప్పగించిన బాధ్యతలు, ఇప్పటివరకు చేపట్టిన ఏర్పాట్లు, ఇంకా చేపట్టాల్సిన కార్యక్రమాలపై సమీక్షించారు.

గడువులోగా పనులు పూర్తి చేయాలి…
వేడుకలకు సమయం తక్కువగా ఉన్నందున ప్రతి శాఖకు కేటాయించిన బాధ్యతలను వెంటనే చేపట్టి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రోటోకాల్‌కు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు ఉండాలని, కార్యక్రమంలో ఎలాంటి సమన్వయ లోపం తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో అధికారులు పనిచేయాలని అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హాజరుకానున్నట్లు తెలిపారు. జెండా ఆవిష్కరణ, సెరిమోనియల్ పరేడ్, గార్డ్ ఆఫ్ హానర్, డ్రోన్ పర్యవేక్షణ, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, భద్రతా ఏర్పాట్లను పోలీస్ శాఖ సమన్వయంతో పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో పాల్గొనే సిబ్బందికి అవసరమైన ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని సూచించారు.

మౌలిక వసతులు సిద్ధం చేయాలి…
వేడుకల సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. వేదిక, డెకరేషన్, తాగునీరు, పారిశుధ్యం, లైటింగ్, టాయిలెట్లు, ఇతర మౌలిక వసతుల ఏర్పాట్లను పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. పతాకాలు, ఫ్లాగ్ పోల్స్, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, ఐటీ సంబంధిత ఏర్పాట్లను కూడా ముందుగానే సిద్ధం చేయాలని తెలిపారు. ప్రభుత్వ శాఖల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతిబింబించేలా స్టాళ్లు, శకటాలు ఏర్పాటు చేయాలని సూచించారు. పోలీస్, రెవెన్యూ, పరిశ్రమలు, ప్రాథమిక రంగం తదితర ముఖ్య శాఖలకు సంబంధించిన శకటాలు, ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని తెలిపారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించేలా ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. మీడియా కవరేజ్, సమాచార ప్రసారం, కార్యక్రమ వివరాల అందజేతను సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమం అనంతరం ఫొటోగ్రఫీ, సర్టిఫికెట్ల పంపిణీ తదితర అంశాలను కూడా సమన్వయంతో పూర్తి చేయాలని తెలిపారు.

అనుగుణంగా ఏర్పాట్లు…
ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ.. పరేడ్‌లో పాల్గొనే సిబ్బందికి అవసరమైన శిక్షణ, పరేడ్ గ్రౌండ్ సిద్ధం, వాహనాల ఏర్పాటు, ట్రాఫిక్ నియంత్రణ, డ్రోన్ పర్యవేక్షణ, గార్డ్ ఆఫ్ హానర్ తదితర ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు. పోలీస్ శాఖకు సంబంధించిన లాజిస్టిక్ ఏర్పాట్లను గతంలో అనుసరించిన విధానానికి అనుగుణంగా పూర్తి చేస్తామని చెప్పారు. అదనపు ఎస్పీ (ఏఆర్) ఆధ్వర్యంలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ జిల్లా రెవెన్యూ అధికారితో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఈ జూమ్‌ కాన్ఫరెన్స్‌లో ఆర్‌అండ్‌బీ, తుడా, పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ కార్పొరేషన్, ఆరోగ్య, విద్య, ఫైర్, రవాణా, విద్యుత్, ఐ అండ్‌ పీఆర్ తదితర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.