ప్రతి కుటుంబానికి అండగా ‘కుటుంబ భరోసా’..

మక్తల్, ఆంధ్రప్రభ : ఫోటో, వీడియో గ్రాఫర్ల సంక్షేమానికి తెలంగాణ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని సంఘం రాష్ట్ర కోశాధికారి మాధవరెడ్డి అన్నారు. రాష్ట్ర యూనియన్ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న ‘కుటుంబ భరోసా’ పథకం ప్రతి ఫోటో, వీడియో గ్రాఫర్ కుటుంబానికి అండగా నిలుస్తోందని తెలిపారు. ప్రతి ఫోటో, వీడియో గ్రాఫర్ ఈ పథకంలో సభ్యత్వం తీసుకోవాలని సూచించారు.

మక్తల్ పట్టణంలోని ఏఎంఆర్ మినీ ఫంక్షన్ హాల్‌లో శనివారం నిర్వహించిన కుటుంబ భరోసా చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మాధవరెడ్డి రాష్ట్ర నాయకులతో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆరు నెలల క్రితం గుండెపోటుతో మృతి చెందిన మక్తల్‌కు చెందిన ఫోటోగ్రాఫర్ కాడ్గి వెంకటేష్ కుటుంబానికి కుటుంబ భరోసా పథకం కింద రూ.1.60 లక్షల ఆర్థిక సాయాన్ని చెక్కు రూపంలో అందజేశారు. ఇది రాష్ట్రంలో 187వ కుటుంబ భరోసా సహాయమని మాధవరెడ్డి తెలిపారు.

ఫోటో, వీడియో గ్రాఫర్లు నెలకు రూ.10 నుంచి రూ.100 వరకు భరోసా మొత్తాన్ని చెల్లిస్తారని ఆయన వివరించారు. ప్రమాదం, గుండెపోటు లేదా ఇతర కారణాలతో సభ్యుడు మృతి చెందినప్పుడు రాష్ట్రంలోని ఫోటోగ్రాఫర్లంతా కలిసి బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించే విధంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు 187 మంది ఫోటోగ్రాఫర్ల కుటుంబాలకు ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు.

ఇకపై ఫోటో, వీడియో గ్రాఫర్లతో పాటు వారి భార్యలకు కూడా కుటుంబ భరోసా పథకాన్ని వర్తింపజేస్తున్నామని మాధవరెడ్డి వెల్లడించారు. ప్రతి సభ్యుడు తన భార్యను కూడా ఈ పథకంలో చేర్పించాలని సూచించారు.

ఫోటోగ్రఫీ రంగానికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాధాన్యం ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఫోటోగ్రాఫర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాధవరెడ్డి అన్నారు. ఫోటోగ్రాఫర్లను ప్రభుత్వాలు ఆదుకోవాలని, మండల, జిల్లా కేంద్రాల్లో ఫోటో భవనాల ఏర్పాటుకు అవసరమైన ప్రభుత్వ స్థలాలను కేటాయించాలని కోరారు. ఫోటోగ్రాఫర్లంతా ఐక్యంగా ఉండి సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని, ప్రతి ఒక్కరూ కుటుంబ భరోసా పథకంలో సభ్యులుగా చేరాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కుటుంబ భరోసా ఇన్‌చార్జ్ నాగరాజు, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ జగదీష్ గౌడ్, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఇన్‌చార్జీలు చంద్రశేఖర్, కుటుంబ భరోసా ఇన్‌చార్జ్ రమేష్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శివలింగం గౌడ్, మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు నరసింహ, గద్వాల జిల్లా అధ్యక్షుడు శేఖర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రహమత్, శిరీష్ కుమార్, మక్తల్ మండల అధ్యక్షుడు బాలరాజు, కార్యదర్శి వెంకటేష్, కోశాధికారి రాజు, మండల కుటుంబ భరోసా ఇన్‌చార్జ్ కె.పాపిరెడ్డి, గౌరవ అధ్యక్షుడు బి.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.