శ్రీవాణి’ 500 సంచికల ప్రస్థానం..
- విలువల పరిరక్షణకు మహాయజ్ఞం
- మంచిని గ్రహిద్దాం.. పెంచుదాం.. పది మందికి పంచుదాం
- భాష బతికితేనే సంస్కృతి బతుకుతుంది..
- యువత పుస్తక పఠనం అలవర్చుకోవాలి
- విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని
(విజయవాడ, ఆంధ్రప్రభ) : ఆధ్యాత్మికత, సాహిత్యం, సంస్కృతి, మానవతా విలువలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ‘శ్రీవాణి’ మాసపత్రిక 500 సంచికలను పూర్తి చేయడం సాధారణ పత్రికా విజయంగా కాకుండా విలువల పరిరక్షణకు సాగిన మహాయజ్ఞమని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) కొనియాడారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శనివారం నిర్వహించిన ‘శ్రీవాణి’ 500వ సంచిక ఆవిష్కరణ మహోత్సవంలో భారత సర్వోన్నత న్యాయస్థానం మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ, ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు, రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ తదితరులతో కలిసి ఎంపీ కేశినేని చిన్ని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో సంచలనాలు, వేగవంతమైన సమాచారం ప్రాధాన్యం పెరిగినప్పటికీ ఆధ్యాత్మికత, మానవత, నైతిక విలువలను కాపాడుతూ ‘శ్రీవాణి’ 500 సంచికల ప్రస్థానాన్ని కొనసాగించడం అభినందనీయమన్నారు. ‘శ్రీవాణి’ కేవలం చదివే పత్రిక కాదని, జీవితాన్ని మార్చే ఆలోచనలను అందించే పత్రిక అని పేర్కొన్నారు. విద్య ఉపాధిని అందిస్తే విలువలు వ్యక్తిత్వాన్ని నిర్మిస్తాయని, సమాజానికి సాహిత్యం కేవలం అద్దం మాత్రమే కాదని, సరైన దిశను చూపే మార్గదర్శి అని వివరించారు. ప్రముఖ కవి గురజాడ అప్పారావు చెప్పిన “దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్!” అన్న మాటలను ప్రస్తావించిన ఎంపీ, సమాజం పట్ల బాధ్యత, మానవతా విలువలు ప్రతి ఒక్కరిలో మరింత పెంపొందాల్సిన అవసరం ఉందన్నారు.
“భాష బతికితే సంస్కృతి బతుకుతుంది.. సంస్కృతి బతికితే జాతి బతుకుతుంది” అని పేర్కొంటూ తెలుగు భాష, సాహిత్యాన్ని పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ముఖ్యంగా యువత సామాజిక మాధ్యమాల వినియోగాన్ని తగ్గించి మంచి పుస్తకాలు చదివే అలవాటును పెంపొందించుకోవాలని కేశినేని చిన్ని సూచించారు. పుస్తక పఠనం ద్వారా ఆలోచనా విధానం మెరుగుపడటంతో పాటు వ్యక్తిత్వ వికాసం, సమాజం పట్ల బాధ్యత మరింత బలపడతాయని అన్నారు. పుస్తకాలు మనిషి ఆలోచనలను విస్తృతం చేసి, జీవితాన్ని సరైన దిశలో నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.
శ్రీ సత్యసాయి బాబా సందేశమైన డ్యూటీ ఈజ్ గాడ్.. వర్క్ ఈజ్ వర్షిప్ ను ప్రస్తావించిన ఎంపీ కేశినేని చిన్ని, కర్తవ్యాన్ని దైవంగా భావించి పనిచేయడమే నిజమైన సేవ అని పేర్కొన్నారు. ఆధ్యాత్మికత, మానవతా విలువలు, మంచి ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ‘శ్రీవాణి’ తనదైన ముద్ర వేసిందని అభినందించారు.‘శ్రీవాణి’ని 500వ సంచిక వరకు తీసుకురావడంలో కొమరిగిరి కృష్ణమోహనరావు అంకితభావం, నిరంతర కృషి ఎంతో గొప్పదని ఎంపీ చిన్ని కొనియాడారు. ఒక పత్రికను ఇంత సుదీర్ఘకాలం కొనసాగించడం వెనుక సంపాదకులు, రచయితలు, పాఠకులు, నిర్వాహకుల సమష్టి కృషి ఉందన్నారు.
మంచి పత్రికలను ఆదరించడం అంటే భావితరాలకు మంచి విలువలను అందించడమేనని పేర్కొన్నారు. సమాజంలో సానుకూల ఆలోచనలు విస్తరించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. “మంచిని గ్రహిద్దాం.. మంచిని పెంచుదాం.. పది మందికి పంచుదాం” అనే స్ఫూర్తితో ‘శ్రీవాణి’ మరిన్ని సంచికలను పూర్తి చేసి తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, ఆధ్యాత్మిక విలువలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు.
500వ సంచికతో ‘శ్రీవాణి’ చారిత్రక మైలురాయిని చేరుకుందని, తెలుగు సాహిత్యానికి, విలువల ఆధారిత పత్రికా రంగానికి ఇది గర్వకారణమని కేశినేని చిన్ని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పత్రిక నిర్వాహకులు, సంపాదకులు, రచయితలు, పాఠకులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఆధ్యాత్మికవేత్తలు, సాహితీవేత్తలు, విద్యావేత్తలు, ‘శ్రీవాణి’ మాసపత్రిక పాఠకులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
