చౌటుప్పల్లో రాష్ట్రస్థాయి మల్కంబ్ శిక్షణ శిబిరం ప్రారంభం
- ఒలింపిక్స్ స్థాయికి క్రీడాకారులను తీర్చిదిద్దాలి: సీఐ మన్మథ కుమార్
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : ప్రాచీన భారతీయ విద్య అయిన మల్కంబ్ను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలనే లక్ష్యంతో తెలంగాణ మల్కంబ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి శిక్షణ శిబిరం ప్రారంభమైంది. చౌటుప్పల్లోని త్రినిటీ విద్యాసంస్థల ప్రాంగణంలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న ఉపాధ్యాయులు, శిక్షకుల శిక్షణ శిబిరాన్ని శనివారం చౌటుప్పల్ సీఐ మన్మథ కుమార్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మల్కంబ్లో శిక్షకుల ప్రదర్శనలు, ఫిట్నెస్ సాధనలు తనను ఆకట్టుకున్నాయని అన్నారు. మల్కంబ్ అసోసియేషన్ లక్ష్యం నెరవేరాలని ఆకాంక్షించారు. శిక్షణ పొందుతున్న క్రీడాకారులు భవిష్యత్తులో ఒలింపిక్స్ స్థాయికి ఎదిగి దేశానికి, రాష్ట్రానికి పతకాలు సాధించేలా తీర్చిదిద్దాలని సూచించారు.
42 మంది శిక్షకులకు శిక్షణ
రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన 42 మంది శిక్షకులకు ఈ రెండు రోజుల శిబిరంలో మల్కంబ్ లెవెల్-1 ప్రాథమిక నియమాలు, నిబంధనలపై శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ పొందిన కోచ్లు తమ జిల్లాల్లోని విద్యార్థులకు మెరుగైన శిక్షణ అందించి, మల్కంబ్లో నైపుణ్యం సాధించేలా తీర్చిదిద్దుతారని నిర్వాహకులు తెలిపారు.
కార్యక్రమంలో ఎంఎంఆర్ కాలేజ్ ప్రిన్సిపాల్ సంజయ్ సాహు, త్రినిటీ విద్యాసంస్థల చైర్మన్ కేవీబీ కృష్ణారావు, తెలంగాణ మల్కంబ్ అసోసియేషన్ అధ్యక్షురాలు, త్రినిటీ విద్యాసంస్థల డైరెక్టర్, ప్రిన్సిపాల్ డాక్టర్ ఉజ్జని మంజుల, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ముదావత్ గోపాల్, కోశాధికారి పోలే అంజయ్యతో పాటు పలువురు ప్రతినిధులు, శిక్షకులు పాల్గొన్నారు.
