హైదరాబాద్‌లో కుండపోత..
హైదరాబాద్, ఆంధ్రప్రభ : నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోతోంది. ఎలాంటి ముందస్తు సూచన లేకుండానే కొన్ని ప్రాంతాల్లో కాసేపు కుండపోత వర్షం కురుస్తుండగా.. మరికొద్ది నిమిషాల్లోనే వాన పూర్తిగా ఆగిపోయి ఆకాశం నిర్మలంగా మారుతోంది. కేవలం 15 నుంచి 30 నిమిషాల వ్యవధిలోనే రహదారులు జలమయమవుతుండటంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
ఆకస్మికంగా కురుస్తున్న భారీ వర్షాలతో రహదారులపై నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు, బాటసారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రోడ్లపై నీరు నిలిచిన ప్రాంతాల్లో జాగ్రత్తగా ప్రయాణించాలని, వర్షం ప్రారంభమైతే సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన
ఇదిలా ఉండగా, ఉత్తర ఒడిశా, నైరుతి బంగాళాఖాతాన్ని ఆనుకుని అల్పపీడనం ఏర్పడినట్లు విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నట్లు వెల్లడించారు. అల్పపీడన ప్రభావంతో రానున్న 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
