అసోసియేషన్లలో చక్రం తిప్పిన కూటమి నేతలు

  • డీఎస్సీ నియామకాల మెరిట్‌ జాబితా ఎందుకు విడుదల చేయలేదు?
  • నారా లోకేష్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణ కోరాలి
  • హఠాత్తుగా కోన శశిధర్, ఎస్‌ఎస్‌ రావత్‌ బదిలీల్లో మతలబేంటి?
  • రిలే దీక్షలు చేస్తున్న వారిని రౌడీషీటర్లు, గంజాయి బ్యాచ్‌ అంటారా?
  • అధికార పార్టీ నేతలు నోరుంది కదా అని మాట్లాడితే ఖబడ్దార్‌
  • పరీక్షల నిర్వహణలో లోపాలను ప్రశ్నిస్తే గొంతునొక్కుతారా?
  • ఫీజురీయింబర్స్‌మెంట్, నిరుద్యోగ భృతి ఎప్పుడు చెల్లిస్తారు?
  • వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి ప్రశ్న
  • అనంతపురంలో విజయవంతంగా మూడో రోజు రిలే నిరాహార దీక్షలు
  • క్షీణించిన శాంతిభద్రతలకు నిరసనగా శిబిరం వద్ద శాంతికపోతాలు ఎగురవేసిన అనంత వెంకటరామిరెడ్డి

అనంతపురం ప్రతినిధి, ఆంధ్రప్రభ : డీఎస్సీ–2025కు సంబంధించి అక్రమాలకు స్పోర్ట్స్‌ అసోసియేషన్లలోనే బీజం పడిందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి ఆరోపించారు. ఆయా అసోసియేషన్లలో అధికార పార్టీ నేతలే ఉన్నాయని, వారి ప్రమేయంతోనే స్పోర్ట్స్‌ కోటాలో అక్రమాల జరిగాయన్నారు. డీఎస్సీ అక్రమాలతో పాటు విద్యార్థి, నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్‌తో వైసీపీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ సమన్వయకర్త అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో మునిసిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి.

శనివారం దీక్షలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీ, క్రిస్టియన్‌ మైనారిటీ, లీగల్‌ సెల్, సోషల్‌ మీడియా, ఐటి, బూత్‌ కమిటీ, ప్రచారం విభాగం, వాణిజ్య విభాగాలతో పాటు 24వ డివిజన్‌ నుంచి 50వ డివిజన్ల వరకు, రుద్రంపేట, అనంతపురం రూరల్‌ పంచాయతీల నాయకులు, కార్యకర్తలు కూర్చున్నారు. ముందుగా రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలకు నిరసనగా శిబిరం వద్ద శాంతి కపోతాలను అనంత వెంకటరామిరెడ్డి ఎగురవేసి రిలే దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీఎస్సీ ఫలితాలు విడుదలయ్యాక మెరిట్‌ జాబితాను ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు. స్టోర్స్‌ కోటాలో బేరసారాలు చేసి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు.

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ హయాంలో 6100 టీచర్‌ పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేస్తే అప్పట్లో 25 వేల పోస్టులున్నాయి, వాటిని భర్తీ చేయాలంటూ టీడీపీ నేతలు ఆందోళనలు చేశారన్నారు. తీరా కూటమి అధికారంలోకి వచ్చాక 6100 పోస్టుల నోటిఫికేషన్‌ను రద్దు చేసి 16 వేల పోస్టులకు కొత్తగా నోటిఫికేషన్‌ ఇచ్చారన్నారు. తీరా నియామక ప్రక్రియలో అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. డీఎస్సీలో అన్యాయానికి గురైన వారి తరఫున వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆందోళనలు చేస్తుంటే చంద్రబాబు, అధికార పార్టీ నేతలు చులకనగా మాట్లాడుతున్నారని తెలిపారు.

డీఎస్సీలో ఎలాంటి అక్రమాలు జరగకపోతే సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. డీఎస్సీ కన్వీనర్‌ను పక్కన పెట్టి ఎస్‌సీఆర్‌టీ డైరెక్టర్‌కు పరీక్షల నిర్వహణ ఇవ్వడంలో లోగుట్టు ఏముందన్నారు. తాము ఆందోళనలు చేస్తుంటే గొంతునొక్కాలని ప్రయత్నిస్తున్నారని, అక్రమ అరెస్టులు, కేసులు పెడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో పోలీస్‌కానిస్టేబుల్, గ్రూప్‌ 2 ఇతరత్రా పోస్టులు ఖాళీగా ఉన్నా మళ్లీ డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇస్తాం..ప్రీపేర్‌ అవ్వండి అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారని తెలిపారు. ఇదంతా డైవర్షన్‌ పాలిటిక్స్‌లో భాగమేనన్నారు. కర్నూలులో టీచర్లతో నిరసనలు చేయిస్తున్నారని, తాము అర్హులైన అభ్యర్థులకు వ్యతిరేకం కాదన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు.

ఎలాంటి అర్హత లేకుండా స్పోర్ట్స్, దివ్యాంగుల కోటాలో కొంత మంది ఉద్యోగాలు పొందారని.. పరీక్షల నిర్వహణలో లోపాలను తాము ప్రశ్నిస్తున్నామని స్పష్టం చేశారు. స్పోర్ట్స్‌ కోటాకు సంబంధించి 470 మంది జాబితా ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు. రిలే నిరాహార దీక్షలు చేస్తుంటే గంజాయి బ్యాచ్, రౌడీషీటర్లు ఉన్నారంటూ అధికార పార్టీ నేతలు విమర్శించడాన్ని అనంత వెంకటరామిరెడ్డి తీవ్రంగా ఖండించారు. అలా విమర్శలు చేస్తున్న వారు పక్కన ఎవరెవరు ఉన్నారో చూసుకోవాలని చురకలంటించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లు దాటిందని, ఫీజురీయింబర్స్‌మెంట్‌ కింద రూ.9500 బకాయిలు చెల్లించాలని కోరడం తప్పా? అని ప్రశ్నించారు.

నిరుద్యోగులకు ప్రతి నెలా రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి 25 నెలలు గడిచినా ఎందుకు ఇవ్వలేదన్నారు. డీఎస్సీ నియామకాలకు సంబంధించి అక్రమాలు జరగకపోతే.. నిజంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణ కోరి తన నిజాయితీని నిరూపించుకోవాలని సవాల్‌ విసిరారు. డీఎస్సీ అక్రమాలపై పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్న సమయంలో పాఠశాల విద్య సెక్రటరీ కోన శశిధర్‌ను, జీఏడీ స్పెషల్‌ సీఎస్‌ రావత్‌లను హఠాత్తుగా ఎందుకు బదిలీ చేశారని ప్రశ్నించారు. ఇదే సమయంలో గతంలో టీటీడీలో పని చేసిన శ్యామలరావును పాఠశాల విద్య సెక్రటరీగా ఎందుకు తీసుకొచ్చారు? ఇప్పుడు ఆయనతో ఎలాంటి కథలు చెప్పించబోతున్నారు? అని ప్రశ్నించారు.

సీఎం చంద్రబాబు ఎక్కడకు వెళ్లినా గంజాయి బ్యాచ్‌.. గంజాయి బ్యాచ్‌ అంటున్నారని.. నిజంగా రాష్ట్రంలో గంజాయి దొరుకుతుంటే ఈ ప్రభుత్వ వైఫల్యం కాదా? అని అన్నారు. అధికార పార్టీ నేతలు నోరుంది కదా అని ఎలాపడితే అలా మాట్లాడితే తస్మాత్‌ జాగ్రత్త అని హెచ్చరించారు. ఈ రోజుతో రిలే నిరాహార దీక్షలు మాత్రమే ముగుస్తాయని, తమ ఉద్యమం కాదని స్పష్టం చేశారు. ఈ నెల 10వ తేదీన డీఎస్సీ అక్రమాలపై అనంతపురం నగరంలోని పవర్‌ ఆఫీస్‌ నుంచి పాతూరులోని మహాత్మాగాంధీ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టనున్నట్లు తెలిపారు. యువత, విద్యార్థులు, నిరుద్యోగులు, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.