వర్షాకాలంలో బురదమయం..

ఏళ్లుగా రోడ్డు లేక అవుసలోనిపల్లి ఎస్టీ కాలనీ వాసుల అవస్థలు
వెంటనే రోడ్డు నిర్మించాలని వేడుకోలు
కాలనీ రహదారికి హద్దులు గుర్తించినా పనులు ముందుకు సాగలేదంటున్న గ్రామస్తులు

ఊట్కూర్, ఆంధ్రప్రభ : రహదారి సౌకర్యం లేక అవుసలోనిపల్లి ఎస్టీ కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏళ్లుగా రోడ్డు నిర్మించాలని అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం రావడంతో పరిస్థితి మరింత దారుణంగా మారిందని చెబుతున్నారు.

నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని అవుసలోనిపల్లి ఎస్టీ కాలనీలో రహదారి సౌకర్యం సరిగా లేకపోవడంతో నిత్య రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాలనీకి రోడ్డు సౌకర్యం కల్పించాలని గ్రామ నాయకులు, కాలనీవాసులు తహసీల్దార్‌ అశోక్‌కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. స్పందించిన తహసీల్దార్‌ సర్వేయర్‌తో కలిసి రహదారిని పరిశీలించి, నక్ష ఆధారంగా హద్దులు గుర్తించి రాళ్లు ఏర్పాటు చేసినట్లు గ్రామస్తులు తెలిపారు.

అయితే గ్రామంలోని వివిధ ప్రాంతాల నుంచి వర్షపు నీరు కాలనీ రహదారిలోకి చేరడంతో అక్కడ పెద్ద గుంత ఏర్పడిందని చెబుతున్నారు. దీంతో రహదారి బురదమయంగా మారి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారని, అత్యవసర పరిస్థితుల్లో కాలనీ నుంచి బయటకు రావడం కూడా కష్టంగా మారిందని వాపోతున్నారు.

రహదారిపై కల్వర్టు నిర్మించి, తాత్కాలికంగా మొరం పోసి రాకపోకలు సాగేలా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో పావనికి వినతిపత్రం సమర్పించినట్లు కాలనీవాసులు తెలిపారు. వర్షాకాలంలో పరిస్థితి మరింత దిగజారకముందే అధికారులు స్పందించి తాత్కాలిక రహదారి ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

శాశ్వత రహదారి నిర్మిస్తాం

అవుసలోనిపల్లి గ్రామంలోని ఎస్టీ కాలనీకి వెళ్లేందుకు గత కొన్నేళ్లుగా రహదారి లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని సర్పంచ్‌ ఎల్లమ్మ తిమ్మయ్య, పంచాయతీ కార్యదర్శి మాధురిక తెలిపారు. తహసీల్దార్‌ దృష్టికి సమస్యను తీసుకెళ్లడంతో రహదారి నక్ష ఆధారంగా ముళ్లపొదలు తొలగించి హద్దులు గుర్తించినట్లు చెప్పారు.

కాలనీలోకి గ్రామంలోని వివిధ ప్రాంతాల నుంచి వర్షపు నీరు చేరడంతో రహదారి బురదమయంగా మారుతున్న విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులతో రహదారి నిర్మాణానికి తీర్మానం చేసి, నిధులు మంజూరైన వెంటనే సీసీ రోడ్డు నిర్మిస్తామని స్పష్టం చేశారు.

అప్పటి వరకు ప్రజలు ఇబ్బందులు పడకుండా మొరం రోడ్డు ఏర్పాటు చేసేందుకు ఉన్నతాధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శి తెలిపారు. మరోవైపు రహదారి సమస్యను వెంటనే పరిష్కరించకపోతే ఆందోళన చేపడతామని కాలనీవాసులు హెచ్చరిస్తున్నారు.