పండుగ సాయన్న సేవలు మరువలేని

ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు పంబల్ల యాదగిరి

తాడ్వాయి, ఆగస్టు 8 (ఆంధ్రప్రభ): అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పండుగల సాయన్న చేసిన సేవలు మరువలేనివని తాడ్వాయి మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు పంబల్ల యాదగిరి అన్నారు. తెలంగాణ రాబిన్‌హుడ్‌గా పిలువబడే పండుగల సాయన్న జయంతి వేడుకలను శనివారం తాడ్వాయి మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా పండుగల సాయన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పంబల్ల యాదగిరి మాట్లాడుతూ.. పండుగల సాయన్న నిజాం పాలనలో అణగారిన వర్గాల ప్రజల కోసం పోరాడారని అన్నారు. పేదల ఆకలి తీర్చేందుకు సంపన్నులు, భూస్వాముల వద్ద ఉన్న ధాన్యాన్ని సేకరించి పేదలకు పంచిపెట్టిన ప్రజా నాయకుడిగా ఆయనకు గుర్తింపు ఉందన్నారు.

అణగారిన వర్గాలపై జరుగుతున్న దోపిడీ, అణచివేతకు వ్యతిరేకంగా పండుగల సాయన్న తిరుగుబాటు చేశారని యాదగిరి గుర్తుచేశారు. చిన్ననాటి నుంచే సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన ఆయన ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన పండుగల సాయన్న చరిత్రను భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన ఆశయాలు, పోరాట స్ఫూర్తిని నేటి యువతకు తెలియజేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం ఉపాధ్యక్షుడు గుడికాడ రాజు, కార్యదర్శి పని పవన్, కోశాధికారి పంబల్ల పండరి, సలహాదారులు పని చిన్న రాజయ్య, పంబల్ల లక్ష్మణ్, పని సాయన్న, పంబల్ల సదాశివుడు, పంబల్ల సతీష్ తదితరులు పాల్గొన్నారు.