గ్రీన్ గుంటూరుకు డిజిటల్ క్రియేటర్ల చేయూత
- ఆగస్టు 15 నుంచి ‘మిషన్ జీరో ప్లాస్టిక్’ అమలు..
- 1.20 లక్షల మొక్కలు నాటే లక్ష్యం: జిల్లా కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ
గుంటూరు, ఆంధ్రప్రభ: గ్రీన్ గుంటూరు, నవ గుంటూరు కార్యక్రమాలను విజయవంతం చేయడంలో డిజిటల్ క్రియేటర్లు కీలక పాత్ర పోషించాలని గుంటూరు జిల్లా కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ పిలుపునిచ్చారు. గుంటూరు డిజిటల్ క్రియేటర్స్ అసోసియేషన్ (డీజీసీఏ) సభ్యులు కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంగా ఆయన ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో చేపడుతున్న గ్రీన్ గుంటూరు కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఆరు అడుగుల మొక్కను నాటి, దానితో సెల్ఫీ తీసుకుని #GreenGuntur హ్యాష్‌ట్యాగ్‌తో సామాజిక మాధ్యమాల్లో పంచుకోవాలని సూచించారు. అత్యధికంగా మొక్కలు నాటిన వారికి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేస్తామని తెలిపారు.
జిల్లాలో పచ్చదనాన్ని పెంచేందుకు 1.20 లక్షల మొక్కలు నాటే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని, మొక్కల సంరక్షణ కోసం జియో-ట్యాగింగ్ ,ప్రత్యేక మొబైల్ యాప్‌ను వినియోగిస్తున్నట్లు వెల్లడించారు.
అలాగే నవ గుంటూరు కార్యక్రమంలో భాగంగా నగరాన్ని పరిశుభ్రంగా, ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు ఆగస్టు 15 నుంచి ‘మిషన్ జీరో ప్లాస్టిక్’ అమలు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం, రోడ్లపై చెత్త వేయడం వంటి ఉల్లంఘనలపై జరిమానాలు విధించనున్నట్లు స్పష్టం చేశారు.
గ్రీన్ గుంటూరు, నవ గుంటూరు కార్యక్రమాల విజయానికి ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, డిజిటల్ క్రియేటర్లు చురుకుగా భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
