ముఖ్యమంత్రి రాక.. కలిదిండులో ముమ్మర ఏర్పాట్లు

  • అధికారులు సమన్వయంతో పనిచేసి పర్యటనను విజయవంతం చేయాలి
  • ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశం

ఆంధ్రప్రభ, ఏలూరు/కలిదిండి: రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను త్వరితగతిన పూర్తిచెయ్యాలని జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. కైకలూరు నియోజకవర్గం కలిదిండి మండలం కలిదిండి గ్రామంలో శుక్రవారం ఈ నెల 10వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా ముందస్తు ఏర్పాట్లను ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండు హెలిప్యాడ్ కొరకు, అగ్రికల్చర్ మార్కెటు కమిటీ కార్యాలయం ప్రక్కన ఖాళీస్థలంలో ప్రజావేదిక, అగ్రికల్చర్ మార్కెటు కమిటీ కార్యాలయం క్యాడరు మీటింగు, తహశీల్దారు కార్యాలయం, తదితర ప్రాంతాలను జిల్లా కలెక్టరు పరిశీలించారు. అనంతరం యంపిడివో కార్యాలయ సమావేశ మందిరంలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లుపై అధికారులతో సమీక్షా సమావేశాన్ని జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అధ్యక్షతన నిర్వహించారు. జిల్లా కలెక్టరుతో పాటు ముఖ్యమంత్రి భద్రతా అధికారులు, జిల్లా జాయింటు కలెక్టరు యం.జె.అభిషేక్ గౌడ లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నెల 10వ తేదీ కైకలూరు నియోజకవర్గం కలిదిండి మండలం రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా రాజముద్రతో రూపొంచిన పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ కార్యక్రమానికి రాక సందర్భంగా, శాఖలు వారీగా కేటాయించిన పనులు వేగవంతం చెయ్యాలని ఆదేశించారు. ఎక్కడ ఏ ఒక్కచిన్నపొరపాటుకు తావులేకుండా పగడ్బందీగా ఏర్పాట్లు పూర్తిచెయ్యాలని అన్నారు. గత అనుభవాలను బేరీజు వేసుకుని ఏర్పాట్లును పూర్తి చేస్తూ, సాయంత్రానికి పూర్తిస్థాయిలో ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలని అన్నారు.

పర్యటన అత్యంత పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తిచేసి, పర్యటన పూర్తయ్యేవరకు అధికారులకు కేటాయించిన విధులు అప్రమత్తంగా నిర్వహించాలని ఆదేశించారు. హెలిప్యాడ్, ప్రజావేదిక, క్యాడరు సమావేశం, పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీపై ప్రత్యేక దృష్టిసారించాలని అన్నారు. బాగా మాట్లాడే రైతులను ఎంపిక చేసి, వారికి కూడా ఐడిపాసులు జారీ చెయ్యాలని ఆదేశించారు. వివిధ శాఖలు అధికారులు తమకు కేటాయించిన పనులు పూర్తిచేసి, ఫిట్ నెస్ సర్టిఫికెటు ఇవ్వాలని అన్నారు. ఎక్కడ ఎటువంటి లోటు లేకుండా చల్లటి రక్షిత మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లు, అందరికి అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. అన్ని మందులతో వైద్యులు, సిబ్బందితో వైద్యశిబిరాలు ఏర్పాటుచెయ్యాలని సూచించారు. వ్యవసాయ అనుబంధ శాఖలు ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏర్పాటు చెయ్యాలని అన్నారు.

ఎమ్మెల్యే డా.కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కలిదిండి మండలం పర్యటన విజయవంతం చెయ్యుటకు జిల్లా యంత్రాంగానికి మా తరపున సహకారం అందిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన విజయవంతం చెయ్యుటకు నియోజకవర్గం ప్రజలు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు ఎదురుచూస్తున్నారని అన్నారు. ప్రజాదర్బార్లో 22ఏ నిషేధిత జాబితా నుంచి విముక్తి కలిగించిన భూములకు, రాజముద్రతో కూడిన కొత్తపట్టాదారు పాసుపుస్తకాలు రైతులకు పంపిణీ చేస్తారన్నారు. రైతులతో ముఖ్యమంత్రి మమేకం అవుతారని, రైతులు ఎదురు చూస్తున్నారని తెలిపారు. పర్యటనలో ఏ విధమైన అవాంతరాలు, సమస్యలు రాకుండా ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లును పూర్తిచేస్తున్నామని అన్నారు. కైకలూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చెయ్యుటకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను పూర్తి చేస్తున్నామన్నారు. హెలిప్యాడ్, ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించే ప్రదేశాలను, కాన్వాయ్ మార్గాలను క్షుణ్ణంగా తనిఖీ చేసామని అన్నారు. పర్యటనలో ఏటువంటి అంతరాయం లేకుండా సాఫీగా సాగేందుకు భద్రతా ప్రణాళికలు పటిష్టంగా అమలుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రోడ్డుకు ఇరువైపులా బాంబు డిస్పోజల్ టీమ్, డాగ్ స్క్వాడ్, స్పెషల్ పార్టీ పోలీసులతో మొత్తం జల్లెడ పడుతున్నామని అన్నారు. బ్యారీకేడింగు, రోప్ పార్టీ, పార్కింగు ప్లేసులు సిద్ధం చేశామని తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు నిరంతరం గట్టినిఘా కొనసాగుతుందని తెలిపారు. విధుల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ ఫోటోతో కూడిన పాసును ధరించాలని అన్నారు. అనధికార డ్రోన్లు తిరగకుండా గట్టినిఘా పెట్టామని, సీసీ కెమెరాలు పర్యవేక్షణతో పోలీసులు కంట్రోలు రూమ్ ఉంటుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి యం.శ్రీదేవి, సబ్ కలెక్టరు బొల్లిపల్లి వినూత్న, జెడ్పీ సిఈవో పి.జగదాంబ, విజిలెన్సు స్పెషల్ డిప్యూటీ కలెక్టరు ఎల్.దేవకీదేవి, ఆర్డీవో కె.లక్ష్మీప్రసన్న, జిల్లా, డివిజన్, మండల వివిధ శాఖలు అధికారులు, ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు, పాల్గొన్నారు.