కర్నూలు కార్పొరేషన్‌లో ఐదుగురు బీఎల్‌వోలు సస్పెన్షన్

  • ఎన్నికల ప్రత్యేక సవరణలో నిర్లక్ష్యం.. ఈఆర్‌ఓ చర్యలు
  • విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించిన ఐదుగురిపై వేటు

కర్నూలు రూరల్ బ్యూరో, ఆంధ్రప్రభ: కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్న ఐదుగురు బూత్ స్థాయి అధికారుల (బీఎల్‌వోలు)పై సస్పెన్షన్ వేటు పడింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) సర్వే ప్రక్రియలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించడంతో పాటు ఏపీ సివిల్ సర్వీసెస్ (కండక్ట్) నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించిన నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి చల్ల ఓబులేశ్ వారిని సస్పెండ్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

సస్పెన్షన్‌కు గురైన వారిలో ఎన్. చంద్రకళ, బి. గిరిబాబు, బస్తిపాటి పరమేశ్వర్లు, అబ్దుల్ బాసిత్, రేవతి ఉన్నారు. ఓటరు జాబితాల ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా ఇంటింటి సర్వే, ఓటర్ల వివరాల ధృవీకరణ, నమోదు ప్రక్రియలను సమర్థవంతంగా నిర్వహించాల్సి ఉండగా, విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించినట్లు విచారణలో తేలడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఎన్నికల ప్రక్రియలో నిర్లక్ష్యాన్ని ఏమాత్రం సహించబోమనే ఉద్దేశంతో ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. ఓటరు జాబితాల సవరణ కార్యక్రమంలో పాల్గొంటున్న బీఎల్‌వోలు, ఇతర ఎన్నికల సిబ్బంది నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ విధులు నిర్వర్తించాలని ఎన్నికల అధికారులు ఆదేశించారు.