పుట్టగొడుగుల సాగు.. మహిళలు, యువతకు బంగారు భవిష్యత్
జిల్లా కలెక్టర్ డీకే బాలాజి
ఘంటసాల, ఆంధ్రప్రభ: వ్యవసాయానికి అనుబంధంగా అధిక ఆదాయాన్ని అందించే పుట్టగొడుగుల సాగును స్వయం ఉపాధి అవకాశంగా మలుచుకొని మహిళలు, యువత విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి పిలుపునిచ్చారు.
కృష్ణా జిల్లా ఉద్యాన శాఖ, ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) సంయుక్త ఆధ్వర్యంలో, రేసిలియంట్ అగ్రి టెక్ ఫార్మ్స్ సహకారంతో మహిళలు, యువతకు నిర్వహించిన మూడు రోజుల పుట్టగొడుగుల పెంపకంపై రైతు శిక్షణ కార్యక్రమం శుక్రవారం ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రంలో విజయవంతంగా ముగిసింది. ముగింపు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై శిక్షణార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, సహాయ కలెక్టర్ నమ్రత అగర్వాల్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో కొత్త తరహా ఉపాధి అవకాశాలను సృష్టించాలనే లక్ష్యంతో “స్పిరిటెడ్ ఆంట్రప్రెన్యూర్స్ ప్రోగ్రామ్” ప్రారంభించామని తెలిపారు. వ్యాపార ఆలోచనలు ఉన్న యువతను గుర్తించి వారికి ఆర్థిక, సాంకేతిక, మార్కెటింగ్ పరమైన సహకారం అందించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమన్నారు. తొలుత 150 మందితో ప్రారంభించాలని భావించినప్పటికీ జిల్లాలో 700 మందికి పైగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను గుర్తించగలిగామని చెప్పారు. వారికి మార్కెట్ అవకాశాలు కల్పించేందుకు బయ్యర్-సెల్లర్ మీట్లు నిర్వహించామని, వాటి ద్వారా రేసిలియంట్ అగ్రి టెక్ ఫార్మ్స్ వంటి సంస్థలతో అనుసంధానం ఏర్పడిందన్నారు.
స్వయం సహాయక సంఘాల మహిళలు ఉత్పత్తి చేసే మిల్క్ మష్రూమ్‌లను కొనుగోలు చేసేందుకు సంస్థ ముందుకు రావడం ఈ కార్యక్రమానికి మరింత బలాన్ని చేకూర్చిందన్నారు. యూనిట్ స్థాపనకు అవసరమైన వ్యయానికి జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు.
చిన్న స్థాయిలో పుట్టగొడుగుల సాగు ప్రారంభించిన మహిళా పారిశ్రామికవేత్త ప్రసన్న ప్రభుత్వ ప్రోత్సాహం, రుణ సహాయంతో తన యూనిట్‌ను విస్తరించి విజయవంతంగా అభివృద్ధి చేసుకున్నారని పేర్కొంటూ, అలాంటి విజయగాథలు మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు.
వ్యాపారంలో విజయం సాధించాలంటే కష్టపడి పనిచేయడం, కొత్తగా ఆలోచించడం, ఎదురయ్యే ఇబ్బందులకు వెనుకడుగు వేయకుండా పట్టుదలతో ముందుకు సాగడం ఎంతో ముఖ్యమని కలెక్టర్ సూచించారు. ప్రారంభ దశలో మార్కెట్‌ను సాధించడం కొంత కష్టమైనప్పటికీ, నాణ్యతను కాపాడుతూ నిరంతర ప్రయత్నం చేస్తే అవకాశాలు వాటంతట అవే వస్తాయని చెప్పారు. వరి వంటి సంప్రదాయ పంటలతో ఆశించిన ఆదాయం లభించని ప్రస్తుత పరిస్థితుల్లో పుట్టగొడుగుల సాగు అదనపు ఆదాయానికి మంచి అవకాశమని పేర్కొన్నారు.
శిక్షణ పొందిన 60 మంది మహిళలు, యువత భవిష్యత్తులో విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షిస్తూ, ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం నుంచి అవసరమైన అన్ని విధాల మద్దతు అందిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
మూడు రోజుల శిక్షణ కార్యక్రమంలో తొలి రోజు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు పుట్టగొడుగుల పెంపకానికి సంబంధించిన శాస్త్రీయ, సాంకేతిక అంశాలపై అవగాహన కల్పించారు. రెండో రోజు పామర్రులోని రేసిలియంట్ అగ్రి టెక్ ఫార్మ్స్ యూనిట్‌లో ప్రత్యక్ష శిక్షణ నిర్వహించి పుట్టగొడుగుల ఉత్పత్తి, నిర్వహణ పద్ధతులను వివరించారు. మూడో రోజు నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో శిక్షణ అనంతరం చేపట్టాల్సిన కార్యాచరణ, స్వయం ఉపాధి అవకాశాలు, మార్కెటింగ్ వ్యూహాలపై మార్గనిర్దేశం చేసి, శిక్షణ పూర్తిచేసిన మహిళలు, యువతకు నైపుణ్య ధ్రువపత్రాలను అందజేశారు.
కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ డైరెక్టర్ కోఆర్డినేటర్ డాక్టర్ డి. సుధారాణి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి జె. జ్యోతి, డీఆర్‌డీఏ పీడీ వై. హరిహరనాథ్, సస్యరక్షణ విభాగం ఎస్‌ఎంఎస్ డా. కె. రేవతి, రేసిలియంట్ అగ్రి టెక్ ఫార్మ్స్ వ్యవస్థాపకులు ఆర్.వి.ఎల్. మనోహర్, డి.సుధ, ఉద్యానవన శాఖ అధికారులు, ఏపీఎంలు, మహిళలు, యువత తదితరులు పాల్గొన్నారు.
