ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై కఠిన నిబంధనలు..

  • ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
  • విద్యాశాఖ కొత్త ఆదేశాలు
  • ఫీజు వివరాలు బహిరంగ ప్రదర్శన తప్పనిసరి..

హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణలో ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల వసూళ్లలో పారదర్శకత తీసుకురావడానికి విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు వివరాలను అన్ని ప్రైవేట్ పాఠశాలలు తప్పనిసరిగా బహిరంగంగా ప్రదర్శించాలని విద్యాశాఖ డైరెక్టర్ ఈ. నవీన్ నికోలస్, ఐఏఎస్ ఆదేశాలు జారీ చేశారు.

తరగతుల వారీగా ట్యూషన్ ఫీజు వివరాలను పాఠశాల నోటీస్ బోర్డుపై ప్రదర్శించడంతో పాటు, ఆయా పాఠశాలల అధికారిక వెబ్‌సైట్‌లో కూడా పూర్తి వివరాలను పొందుపరచాలని సూచించారు. అదేవిధంగా schooledu.telangana.gov.in పోర్టల్‌లో కూడా ఫీజు వివరాలను నమోదు చేయడం తప్పనిసరి అని స్పష్టం చేశారు.

ఫీజుల నిర్ణయానికి సంబంధించిన గవర్నింగ్ బాడీ సభ్యుల సంతకాలతో కూడిన పత్రాలు, గత విద్యా సంవత్సరాలకు సంబంధించిన ఆడిట్ నివేదికలను కూడా పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. ఈ ప్రక్రియను జి.ఓ.ఎంఎస్. నెం.1లోని రూల్ 16, 18 ప్రకారం అమలు చేయాలని పేర్కొన్నారు.

ఫీజు వివరాలను నోటీస్ బోర్డు, వెబ్‌సైట్, ప్రభుత్వ పోర్టల్‌లో ప్రదర్శించని పాఠశాలలకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు. జి.ఓ.ఎంఎస్. నెం.1లోని రూల్ 11 ప్రకారం నిబంధనలు ఉల్లంఘించిన విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఈ ఆదేశాల అమలును జిల్లా విద్యాశాఖ అధికారులు (డీఈవోలు), ప్రాంతీయ సంయుక్త విద్యాశాఖ అధికారులు (ఆర్జేడీలు) పర్యవేక్షించాలని విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశించారు.