మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట
కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
ఎర్రగట్టుగుట్ట, ఆంధ్రప్రభ : మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు అన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
శుక్రవారం ఎర్రగట్టుగుట్ట వెంకటేశ్వర కల్యాణ మండపంలో 65, 66వ డివిజన్లకు చెందిన మహిళలకు ఇందిరమ్మ చీరలను ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మహిళల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందన్నారు. మహిళా సాధికారత, స్వయం సహాయక సంఘాల అభివృద్ధి కోసం పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.
అర్హులైన పేద మహిళలు, మహిళా సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరలను అందజేస్తున్నామని చెప్పారు. అర్హులైన ప్రతి మహిళకు చీరలు అందేలా పారదర్శకంగా, ప్రణాళికాబద్ధంగా పంపిణీ చేయాలని అధికారులకు సూచించారు.
కుటుంబ అభ్యున్నతిలో మహిళల పాత్ర కీలకమని ఎమ్మెల్యే అన్నారు. భవిష్యత్ తరాల బాగు కోసం పిల్లలను బాగా చదివించాలని మహిళలకు సూచించారు.
రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు తదితర పథకాలను ప్రభుత్వం మహిళల పేరుతోనే మంజూరు చేస్తోందని తెలిపారు. మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలనే సంకల్పంతో అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో 66వ డివిజన్ అధ్యక్షుడు కిరణ్, 65వ డివిజన్ అధ్యక్షుడు సునీల్, ఆత్మకూరు మార్కెట్ ఉపాధ్యక్షుడు తిరుపతి, మండల అధ్యక్షుడు అశోక్ కుమార్, మహిళా అధ్యక్షురాలు జోరిక పూల, మహిళా ఉపాధ్యక్షురాలు స్వాతి, మాజీ మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు వీసం సురేందర్ రెడ్డి, వంగపహడ్ సహకార సంఘం చైర్మన్ మెరుగు రాజేష్ గౌడ్, మండల, డివిజన్ స్థాయి నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
