మరణించిన సంఘ సభ్యుడి కుటుంబానికి రూ.93,580 ఆర్థిక భరోసా
పొదుపు సంఘం అండగా నిలిచి ఆర్థిక సహాయం అందజేత
సంగెం, ఆంధ్రప్రభ : మండలంలోని కుంటపల్లి గ్రామ కుటుంబ పెద్దను కోల్పోయిన బాధలో ఉన్న కుటుంబానికి పొదుపు సంఘం అండగా నిలిచింది. కుంటపల్లి గ్రామానికి చెందిన ఏకశిలా పురుషుల పొదుపు సంఘ సభ్యుడు సింగం సంపత్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబానికి సంఘం తరఫున రూ.93,580 ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
కుంటపల్లిలోని సంఘ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆదర్శ పురుషుల పొదుపు సమితి, మందపల్లి (గిర్ని బావి) అధ్యక్షుడు కాగితాల జగన్నాధచారి చేతుల మీదుగా మృతుడు సింగం సంపత్ నామినీ, ఆయన భార్య సూరమ్మకు ఈ మొత్తాన్ని అందజేశారు. ఇందులో సంపత్ సంఘంలో చేసిన పొదుపు, దానికి వచ్చిన బోనస్‌తో పాటు సహవికాస సంస్థ ద్వారా అందిన బీమా మొత్తం కలిపి రూ.93,580 ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా అధ్యక్షుడు కాగితాల జగన్నాధచారి మాట్లాడుతూ కుటుంబాన్ని పోషించే కుటుంబ పెద్ద అకాల మరణంతో ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో సంఘంలోని ప్రతి సభ్యుడికి ప్రతి సంవత్సరం బీమా సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. సంఘంలో సభ్యుడు మరణించినప్పుడు ఆయన నామినీకి రూ.80,000 బీమాతో పాటు సభ్యుడు సంఘంలో చేసుకున్న పొదుపు, దానికి లభించిన బోనస్ మొత్తాన్ని కూడా సంఘ పాలకవర్గం ఆధ్వర్యంలో అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.
గత 22 సంవత్సరాలుగా సంఘ సభ్యులు రూపాయి రూపాయి పొదుపు చేస్తూ ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారని తెలిపారు. సభ్యులు పొదుపు చేసిన మొత్తాల ఆధారంగా 12 శాతం వడ్డీతో అవసరాలకు అనుగుణంగా రుణాలు పొందుతూ ఆర్థికంగా ఎదుగుతున్నారని చెప్పారు. ప్రతి ఒక్కరూ తాము నెలలో సంపాదించే మొత్తంలో కనీసం ఒక్క రోజు సంపాదనను అయినా పొదుపు చేసుకోవాలని సూచించారు.
అలాగే కుంటపల్లి పరిధిలోని సంఘం గ్రామాల్లో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ పొదుపు సంఘంలో సభ్యత్వం తీసుకుని ఆర్థికంగా స్వావలంబన సాధించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సమితి ఉపాధ్యక్షుడు చీకటి కృష్ణ నిరంజన్, సంఘం పర్యవేక్షకులు చిర్ర మొగలి, చింతాకుల సురేందర్, రావుల శ్రీనివాస్, చిర్ర స్వరాజ్, మెట్టిపెళ్లి బాబు, మాడిశెట్టి వీరస్వామి, రావుల రమేష్, గాదె ఇంద్రయ్య, చిర్ర రాజు, ఎన్నపోతుల నరేష్, చిర్ర సంపత్, ఘనకులు కూచన కుమారస్వామితో పాటు పాలకవర్గ సభ్యులు, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
