పెద్ది అన్న జ్ఞాపకాలతో కన్నీటి సంద్రమైన ఇటుకాలపల్లి

పార్టీలకు అతీతంగా తరలివచ్చిన గ్రామ ప్రజలు..

కొవ్వొత్తుల ర్యాలీ, ఘన నివాళులు

నర్సంపేట, ఆంధ్రప్రభ: “పెద్ది అన్న మా ఇంటి మనిషి… మా కుటుంబ సభ్యుడు… ఆయన లేరనే విషయాన్ని ఇప్పటికీ మనసు ఒప్పుకోవడం లేదు…” అంటూ ఇటుకాలపల్లి గ్రామ ప్రజలు భావోద్వేగానికి గురయ్యారు. నర్సంపేట మండలం ఇటుకాలపల్లి గ్రామంలో దివంగత మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమ నాయకుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని గ్రామమంతా ఒక్కటై ఆయనకు అపూర్వ నివాళులు అర్పించింది.

గురువారం రాత్రి గ్రామంలో చిన్నా, పెద్దా, మహిళలు, యువకులు, రైతులు, కూలీలు, వృద్ధులు ఇలా అన్ని వర్గాల ప్రజలు పార్టీలకు అతీతంగా స్వచ్ఛందంగా తరలివచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఇంటి నుంచి ఒకరు కాదు, కుటుంబాలే తరలిరావడం గ్రామ ప్రజల్లో పెద్ది సుదర్శన్‌రెడ్డిపై ఉన్న అపారమైన ప్రేమాభిమానాలకు నిదర్శనంగా నిలిచింది.

ఆగస్టు 6న తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ సార్, పెద్ది సుదర్శన్‌రెడ్డి జన్మదినాలు ఒకే రోజు కావడంతో ఈ ఇద్దరు మహనీయులను స్మరించుకుంటూ గ్రామమంతా కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. “పెద్ది అన్న అమర్ హై”, “జయశంకర్ సార్ ఆశయాలు చిరంజీవి” అంటూ నినాదాలతో గ్రామ వీధులు మార్మోగాయి. అనంతరం పెద్ది సుదర్శన్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు.

కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు కన్నీటి పర్యంతమై మాట్లాడుతూ, “కష్టాల్లో ఉన్నప్పుడు ముందుగా గుర్తొచ్చేది పెద్ది అన్నే. ఎన్నో కుటుంబాలకు ఉపాధి కల్పించి, అనేక మంది యువకులకు చేయూతనిచ్చి, పేదలకు అండగా నిలిచిన మహానుభావుడు. ఆయన చేసిన మేలు ఈ జన్మలో మరువలేం” అంటూ భావోద్వేగంతో నివాళులర్పించారు.

మహిళా సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ, “ప్రజల కష్టాన్ని తన కష్టంగా భావించిన నాయకుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి. ఆయన లాంటి నాయకుడు మళ్లీ రావడం కష్టం” అని పేర్కొన్నారు.

గ్రామ పెద్దలు మాట్లాడుతూ, పెద్ది సుదర్శన్‌రెడ్డి రాజకీయ నాయకుడిగా కాకుండా ప్రతి కుటుంబానికి చెందిన వ్యక్తిగా, ప్రతి మనిషి గుండెల్లో స్థానం సంపాదించుకున్న మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఆయన చూపిన సేవా మార్గం, ప్రజల పట్ల చూపిన ప్రేమాభిమానాలు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తాయని తెలిపారు.

పెద్ది సుదర్శన్‌రెడ్డి జ్ఞాపకార్థం గ్రామ ప్రజలు, బంధుమిత్రులందరికీ విందు భోజనాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని గ్రామానికి చెందిన కట్ల సుధాకర్ గౌడ్, మాజీ ఎంపీటీసీ, ప్రధాన బాధ్యతలు స్వీకరించి విజయవంతం చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మండల రవి, మాజీ సర్పంచ్ సున్నం కొమ్మలు, మాజీ ఎంపీటీసీ భూక్య వీరన్న, మాజీ ఉపసర్పంచ్ జమాండ్ల చంద్రమౌళి, క్లస్టర్ ఇన్‌చార్జ్ ఈర్ల నరసింహ రాములు, బీఆర్‌ఎస్ నాయకులు బొడిగె వినయ్ గౌడ్, మండల రాజమౌళి, పిట్టల శ్రీనివాస్, తాళ్లపల్లి అశోక్ గౌడ్, బుర్ర ఆనంద్, దేసినీ పద్మతో పాటు మహిళా సంఘాల సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని పెద్ది సుదర్శన్‌రెడ్డికి ఘన నివాళులు అర్పించారు.