సామాజిక న్యాయం, జాతీయ రాజకీయాలపై చర్చేనా?
ఆసక్తి రేపిన సమావేశం
హైదరాబాద్, ఆంధ్రప్రభ: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ మనవడు, వంచిత్ బహుజన్ అఘాడీ (VBA) అధ్యక్షుడు ప్రకాశ్ అంబేద్కర్ గురువారం హైదరాబాద్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను మర్యాదపూర్వకంగా కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రాజకీయాలతో పాటు జాతీయ స్థాయిలో దళిత, బహుజన రాజకీయాల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఈ సమావేశానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇరు వర్గాలు అధికారికంగా వెల్లడించలేదు.
ప్రకాశ్ అంబేద్కర్ దేశవ్యాప్తంగా దళిత, బహుజన హక్కులు, రాజ్యాంగ విలువల పరిరక్షణ అంశాలపై నిరంతరం గళం వినిపిస్తున్న నాయకుడు. మరోవైపు, బీఆర్ఎస్ కూడా గత కొన్నేళ్లుగా అంబేద్కర్ ఆశయాలు, సామాజిక న్యాయం, దళిత సంక్షేమ అంశాలను ప్రధాన రాజకీయ అజెండాగా ప్రస్తావిస్తోంది. తెలంగాణలో ప్రపంచంలోనే ఎత్తైన అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు, సచివాలయానికి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పేరు పెట్టడం వంటి నిర్ణయాలను బీఆర్ఎస్ తన పాలనా కాలంలో తీసుకుంది. అంబేద్కర్ ఆశయాల అమలుపై కేటీఆర్ గతంలో పలుమార్లు తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో ప్రకాశ్ అంబేద్కర్–కేటీఆర్ భేటీకి రాజకీయ ప్రాధాన్యం ఉందా? లేక ఇది మర్యాదపూర్వక సమావేశమేనా? అన్న అంశంపై చర్చ సాగుతోంది. ముఖ్యంగా సామాజిక న్యాయం, రాజ్యాంగ పరిరక్షణ, దళిత సాధికారత, సమకాలీన రాజకీయ పరిణామాలు వంటి అంశాలు చర్చకు వచ్చి ఉండవచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే వరకు సమావేశంలో జరిగిన చర్చలపై స్పష్టత రానుంది.
