కారు–డీసీఎం ఢీ.. ఇద్దరి మృతి

ఖమ్మం–దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ప్ర‌మాదం
ప్రమాదంలో తల్లి, కొడుకు అక్కడికక్కడే మృతి
డీసీఎం డ్రైవర్, కారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలు.. పరిస్థితి విషమం
కారులో ఇరుక్కుపోయిన తల్లి, కొడుకు మృతదేహాలు
క్రేన్ సాయంతో మృతదేహాలను బయటకు తీసిన పోలీసులు
మృతులు చింతకాని మండలం గాంధీనగర్‌కు చెందిన వారిగా గుర్తింపు
ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు

ఖమ్మం, ఆగస్టు 6 (ఆంధ్రప్రభ): ఖమ్మం జిల్లాలోని ఖమ్మం–దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవేపై గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తల్లి, కొడుకు అక్కడికక్కడే మృతి చెందారు. ఎదురెదురుగా వస్తున్న కారు, డీసీఎం వాహనం బలంగా ఢీకొనడంతో ఈ విషాదం చోటుచేసుకుంది.

ప్రమాదం తీవ్రతకు కారు పూర్తిగా నుజ్జునుజ్జైపోగా, అందులో ప్రయాణిస్తున్న తల్లి, కొడుకు వాహనంలోనే ఇరుక్కుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని క్రేన్ సాయంతో మృతదేహాలను బయటకు తీశారు.

ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్‌తో పాటు కారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

మృతులను ఖమ్మం జిల్లా చింతకాని మండలం గాంధీనగర్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.