ఖరీఫ్ గట్టెక్కేనా?.. ప్రాజెక్టుల్లో నీటి కొరతతో రైతుల్లో ఆందోళన

ఖరీఫ్ గట్టెక్కేనా?.. ప్రాజెక్టుల్లో నీటి కొరతతో రైతుల్లో ఆందోళన

  • వర్షాలు కురిసినా సాగునీటిపై అనిశ్చితి
  • డెడ్ స్టోరేజీకి చేరువలో నాగార్జునసాగర్
  • గోదావరి ప్రాజెక్టుల్లో నిల్వలు పెరిగినా ఖరీఫ్‌కు సరిపోవా?
  • లక్షల ఎకరాల ఆయకట్టుపై నీటి కొరత ప్రభావం
  • ఆశతో వరి నాట్లు.. ఆందోళనలో రైతులు

(న్యూస్ నెట్‌వర్క్ – ఆంధ్రప్రభ) సాధారణంగా ఖరీఫ్ పంటలపైనే రైతులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. గత ఏడాది ఖరీఫ్ సీజన్‌లో వరి సాగులో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందని ప్రభుత్వం గొప్పగా ప్రకటించింది. అయితే ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో, వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశముందని హెచ్చరిస్తూ, ఖరీఫ్‌లో వరి సాగుకు దూరంగా ఉండాలని ప్రభుత్వం రైతులకు సూచించింది.

తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని అధికార యంత్రాంగం ద్వారా విస్తృతంగా అవగాహన కల్పించింది. రైతులు మాత్రం ఖరీఫ్ గడువు ముగిసే వరకు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపకుండా, వర్షాల కోసం ఎదురుచూశారు. చివరకు వరుణుడు కరుణించడంతో తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి.

భవిష్యత్తులో వర్షాలు కురుస్తాయన్న నమ్మకంతో పలు జిల్లాల్లో రైతులు వరి నాట్లు ప్రారంభించారు. ప్రాజెక్టుల్లోకి నీరు చేరినా ఖరీఫ్‌కు సరిపడ నిల్వలు లేవు. ఈ ఏడాది లక్షలాది ఎకరాలకు సాగునీరు ప్రశ్నార్థకంగా మారింది. దీంతో రైతులు తలలు పట్టుకుంటున్నారు.

ఇటీవల కురిసిన వర్షాలకు, వరదలకు డెడ్ స్టోరేజీలో ఉన్న శ్రీరాంసాగర్, నిజాంసాగర్, కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టుల్లోకి నీరు చేరింది. శ్రీరాంసాగర్, నిజాంసాగర్‌లోకి మాత్రం ఖరీఫ్‌ను గట్టెక్కించే స్థాయిలో నీరు చేరలేదు. కారణాలు ఏమైనా గోదావరి నదిపై నిర్మించిన కాళేశ్వరం ద్వారా నీరు గోదావరి నది దిగువకు విడిచిపెట్టడంతో వృథాగా పోతోంది. కృష్ణా నదిపై ఉన్న నాగార్జునసాగర్‌లో నీటి నిల్వలు డెడ్ స్టోరేజీకి చేరువలో ఉన్నాయి.

మహారాష్ట్రలో కురిసిన వర్షాల ప్రభావంతో గోదావరి నదిలో నీటి ప్రవాహం పెరగడంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి నీరు చేరింది. ఖరీఫ్ సాగుకు అవసరమైన మేర నీటి నిల్వలు మాత్రం ఇంకా అందుబాటులోకి రాలేదు.

కర్ణాటకలో కురిసిన వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కింది. దీంతో జూరాల ప్రాజెక్టులోకి పూర్తి స్థాయిలో నీరు చేరుకుంది. తెలంగాణకు సాగునీటి సరఫరా చేయాల్సిన నాగార్జునసాగర్‌లోకి మాత్రం ఇంకా నీరు చేరలేదు.

మహారాష్ట్రతో పాటు ఛత్తీస్‌గఢ్‌లో కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రాణహిత, వార్ధా నదులు ఉప్పొంగి ప్రవహించాయి. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టులోకి ఒక్కసారిగా భారీ వరద చేరింది.

నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు కింద 68,150 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటి నిల్వలు ఉన్నాయి.

కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టు పరిధిలో 1.25 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటి నిల్వలు 17 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 10 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. ఇంకా ఏడు టీఎంసీల నీటి లోటు ఉంది.

ప్రాజెక్టులో ఎనిమిది టీఎంసీలు ఉంటే ఖరీఫ్‌కు సాగునీటి సరఫరా చేస్తారు. మరో రెండు, మూడు రోజుల్లో నీటి విడుదలపై అధికారులు నిర్ణయం తీసుకుంటారు.

శ్రీరాంసాగర్ పరిస్థితి భిన్నంగా మారింది. ఇటీవల మంత్రుల బృందం పర్యటనలో ఖరీఫ్‌కు సాగునీరు విడిచిపెట్టాలని కోరారు. ఇందుకు స్పందించిన భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ శ్రీరాంసాగర్‌లో నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయని, అధికారులతో సమావేశమై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు.

ఒకప్పుడు 115 టీఎంసీల సామర్థ్యం ఉన్న శ్రీరాంసాగర్ ప్రస్తుతం 80.5 టీఎంసీలకు పడిపోయింది. ఇటీవల కురిసిన వర్షాలతో డెడ్ స్టోరేజీ నుంచి 34.817 టీఎంసీల నీటి నిల్వలకు చేరుకుంది. ప్రాజెక్టులో 50 టీఎంసీలు ఉంటే తప్ప సాగుకు నీరు విడిచిపెట్టే అవకాశం లేదు.

శ్రీరాంసాగర్ కింద ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో 18 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. మిషన్ భగీరథ ద్వారా ప్రతి రోజు 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

శ్రీపాదసాగర్ (ఎల్లంపల్లి) ప్రాజెక్టులో ప్రస్తుతం 18.7862 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఈ ప్రాజెక్టు నుంచి ఎన్టీపీసీ, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు ఒప్పందాల ప్రకారం నీటి సరఫరా కొనసాగుతోంది.

మంథని నియోజకవర్గంలో 20 వేల ఎకరాలు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు లక్షల ఎకరాలు, రామగుండం నియోజకవర్గంలో 16 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందుకు వ్యవసాయం కోసం రోజువారీగా 90 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాల్సి ఉంటుంది.

రామగుండం కార్పొరేషన్, మంచిర్యాల మున్సిపాలిటీ ప్రజల తాగునీటి అవసరాల కోసం కూడా ఎల్లంపల్లి నుంచి నీటి సరఫరా కొనసాగుతోంది.