సర్కారు బడుల్లో కార్పొరేట్ స్థాయి విద్యే లక్ష్యం: ఎమ్మెల్యే

కాల్వశ్రీరాంపూర్ (ఆంధ్రప్రభ): ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యను అందించి పేద విద్యార్థులకు నాణ్యమైన సౌకర్యాలు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. బుధవారం పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని గంగారం, ఊషన్నపల్లి గ్రామాల్లో రూ.10 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, రూ.32 లక్షల వ్యయంతో నిర్మించిన పాఠశాల భవనం, నూతన కంప్యూటర్ ల్యాబ్‌ను ఆయన ప్రారంభించారు. గతంలో సరైన భవనం లేక 20 మంది విద్యార్థులతో ఉన్న పాఠశాల ప్రస్తుతం 56 మంది విద్యార్థులతో అభివృద్ధి చెందడం అభినందనీయమని, త్వరలోనే ఆ సంఖ్యను 75కు పెంచాలని సూచించారు.

పాఠశాలలో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయడం వల్ల విద్యుత్ బిల్లుల భారం తగ్గుతుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని, నియోజకవర్గంలో ఇప్పటివరకు రూ.50 కోట్లకు పైగా విద్యా రంగానికి ఖర్చు చేసినట్లు తెలిపారు. కాల్వశ్రీరాంపూర్ మండలంలో పాఠశాల భవనాలు, ప్రహరీ గోడల నిర్మాణానికి రూ.5 నుంచి రూ.7 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు దసరా నాటికి అల్పాహారం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే ప్రతిభావంతులైన ఉపాధ్యాయులు బోధిస్తున్నారని, ప్రైవేట్ పాఠశాలల ఫీజుల భారం నుంచి బయటపడేందుకు తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని పిలుపునిచ్చారు.