అత్యాధునిక కంటి ఆపరేషన్ థియేటర్‌కు శ్రీకారం…
అవనిగడ్డ, ఆంధ్రప్రభ : అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాధునిక కంటి ఆపరేషన్ థియేటర్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. కృష్ణాజిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది.
జిల్లా అంధత్వ నివారణ సంస్థ చైర్మన్, జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ, వైస్ చైర్మన్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ లోకనాథం దయాకర్, జిల్లా అంధత్వ నివారణ అధికారి డాక్టర్ జి. భానుమూర్తి ప్రత్యేక చొరవతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది.
అవనిగడ్డ నియోజకవర్గంలో లంక గ్రామాలు అధికంగా ఉండటంతో కంటి వైద్య సేవలు అందుబాటులో లేక ప్రజలు శస్త్రచికిత్సల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఈ సమస్యను గుర్తించిన ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ ప్రత్యేక చొరవ తీసుకుని ప్రభుత్వ ఆసుపత్రిలో కంటి వైద్య విభాగం, అత్యాధునిక ఆపరేషన్ థియేటర్ ఏర్పాటుకు కీలక పాత్ర పోషించారు.
ఈ సందర్భంగా జిల్లా అంధత్వ నివారణ అధికారి డాక్టర్ జి. భానుమూర్తి ఆసుపత్రికి మంజూరైన అత్యాధునిక పరికరాలు, జిల్లా అంధత్వ నివారణ సంస్థ సాధించిన పురోగతిని ఎమ్మెల్యేకు వివరించారు. కొత్త సదుపాయాల ద్వారా అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలకు నాణ్యమైన కంటి వైద్యం, శస్త్రచికిత్సలు స్థానికంగానే అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో జిల్లా అంధత్వ నివారణ అధికారి చేసిన కృషిని ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ అభినందించి, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా ఇది కీలక అడుగని పేర్కొన్నారు.
