రామన్నగూడెం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ
- 17.32 మీటర్లకు చేరిన గోదావరి నీటిమట్టం
- లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు
ఉమ్మడి వరంగల్ బ్యూరో, ఆంధ్రప్రభ : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరిలో వరద ఉద్ధృతి మరింత పెరిగింది. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భారీగా వరద నీరు చేరుతుండటంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజీ వద్దకు సుమారు 10.60 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. దీంతో బ్యారేజీకి ఉన్న 85 గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని తుపాకులగూడెం వద్ద ఉన్న సమ్మక్క బ్యారేజీకి 14.60 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరుతుండగా, ఆ నీటిని దిగువకు విడుదల చేయడంతో ఏటూరునాగారం మండలం రామన్నగూడెం వద్ద గోదావరి నీటిమట్టం శుక్రవారం రాత్రి 17.32 మీటర్లకు చేరుకుంది. ఈ నేపథ్యంలో నీటిపారుదల శాఖ అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
ఇదిలా ఉండగా, గోదావరి వరద ప్రభావంతో మంగపేట మండలంలోని పొదుమూరు గ్రామంలోకి వరద నీరు చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా 28 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు.
గోదావరి వరదల నేపథ్యంలో అధికారులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. ప్రజల ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
