Kesineni chinni |ఆరోగ్య పరిశోధనకు కేంద్రం పెద్దపీట

  • దేశవ్యాప్తంగా 4,925 ప్రాజెక్టులకు ఆమోదం
  • లోక్‌సభలో ఎంపీ చిన్ని ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య శాఖ లిఖితపూర్వక సమాధానం
  • పరిశోధన మౌలిక సదుపాయాల విస్తరణకు ప్రత్యేక కేంద్ర రంగ పథకం
  • 1,801 ప్రాజెక్టులు అమల్లో… 1,796 పూర్తయినట్లు వెల్లడి
  • ఏపీకి మరిన్ని పరిశోధన కేంద్రాల కోసం కృషి చేస్తానన్న ఎంపీ కేశినేని చిన్ని

విజయవాడ, ఆంధ్రప్రభ: దేశంలో ఆరోగ్య పరిశోధన రంగాన్ని ప్రపంచస్థాయి ప్రమాణాలకు చేర్చే దిశగా కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కు మరిన్ని ఆరోగ్య పరిశోధన కేంద్రాలు, మౌలిక సదుపాయాలు తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తున్నానని విజయవాడ లోక్‌సభ సభ్యుడు కేశినేని శివనాథ్ (చిన్ని) తెలిపారు. ఆరోగ్య పరిశోధన మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ఆయన లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఆరోగ్య పరిశోధన ప్రోత్సాహం కోసం మౌలిక సదుపాయాల అభివృద్ధి’ కేంద్ర రంగ పథకం ద్వారా వైద్య కళాశాలలు, పరిశోధనా సంస్థల్లో అత్యాధునిక పరిశోధన సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. స్థానిక పరిశోధన సలహా కమిటీల (ఎల్‌ఆర్‌ఏసీలు) సిఫార్సుల ఆధారంగా పరిశోధన ప్రాజెక్టులను ఆమోదిస్తున్నట్లు వివరించారు.

దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 4,925 ఆరోగ్య పరిశోధన ప్రాజెక్టులకు ఆమోదం లభించిందని, వాటిలో 1,796 ప్రాజెక్టులు పూర్తికాగా, 1,801 ప్రాజెక్టులు ప్రస్తుతం అమల్లో ఉన్నాయని వెల్లడించారు. మరో 1,282 ప్రాజెక్టులు ప్రారంభ దశలో ఉండగా, 46 ప్రాజెక్టులు వివిధ కారణాలతో నిలిచిపోయాయని తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టుల్లో 285 ఒక ఏడాదిలోపు, 587 ఒకటి నుంచి రెండు సంవత్సరాల్లో, 619 రెండు నుంచి మూడు సంవత్సరాల్లో, 310 మూడు సంవత్సరాలకు మించి పూర్తయ్యేలా కార్యాచరణ రూపొందించినట్లు పేర్కొన్నారు.

ఈ పథకం పూర్తిగా కేంద్ర రంగ పథకం కావడంతో రాష్ట్రాల వారీగా నిధుల కేటాయింపు ఉండదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య పరిశోధన విభాగానికి కేటాయించిన నిధులను నేరుగా పరిశోధన కేంద్రాలకు విడుదల చేసి మౌలిక సదుపాయాల అభివృద్ధికి వినియోగిస్తున్నట్లు తెలిపింది. గత మూడు సంవత్సరాల్లో మల్టీ-డిసిప్లినరీ రీసెర్చ్ యూనిట్ల ద్వారా 1,100 పరిశోధన ప్రాజెక్టులు పూర్తవడంతో పాటు 687 శాస్త్రీయ పరిశోధనా వ్యాసాలు ప్రచురితమయ్యాయని, 16 కొత్త సాంకేతికతలు, ప్రక్రియలు, పేటెంట్లు లేదా ప్రజారోగ్య మార్గదర్శకాలు అభివృద్ధి చేసినట్లు వెల్లడించింది.

మోడల్ గ్రామీణ ఆరోగ్య పరిశోధన యూనిట్ల ద్వారా 158 పరిశోధన ప్రాజెక్టులు, 140 పరిశోధనా ప్రచురణలు వెలువడగా, 14 పరిశోధనలు ప్రజారోగ్య విధానాల రూపకల్పనకు దోహదపడ్డాయని తెలిపింది. పరిశోధన సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు అత్యుత్తమ పనితీరు కనబరిచిన 8 మల్టీ-డీసీప్లీనరీ రీసెర్చ్ యూనిట్లను ‘సెంటర్స్ ఆఫ్ రీసెర్చ్ ఎక్సలెన్స్’గా అభివృద్ధి చేసినట్లు, అలాగే 5 ప్రైవేట్ వైద్య కళాశాలల్లో కొత్త పరిశోధన యూనిట్లు ఏర్పాటు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల ఆరోగ్య పరిస్థితులపై సమగ్ర సమాచారం కోసం వార్షిక జనాభా ఆధారిత ఆరోగ్య సర్వేను కూడా ప్రారంభించినట్లు పేర్కొంది.

ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆరోగ్య పరిశోధనకు చారిత్రాత్మక ప్రాధాన్యం లభిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మరిన్ని పరిశోధన కేంద్రాలు, వైద్య మౌలిక సదుపాయాలు, ప్రత్యేక ప్రాజెక్టులు మంజూరయ్యేలా కేంద్ర ప్రభుత్వ దృష్టికి నిరంతరం తీసుకెళ్తానని, రాష్ట్ర యువ వైద్యులు, పరిశోధకులు, వైద్య విద్యార్థులకు ప్రపంచస్థాయి పరిశోధన అవకాశాలు కల్పించేందుకు తన వంతు కృషి కొనసాగిస్తానని తెలిపారు