తల్లి, శిశు ఆరోగ్య పరిరక్షణే లక్ష్యం..
ఉచిత గుండె పరీక్షలు, మాతృ కార్డియాక్ రిస్క్ స్క్రీనింగ్‌కు నేడు శ్రీకారం
చిట్టినగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రారంభం
పేద గర్భిణులకు అత్యాధునిక వైద్య సేవలు ఉచితంగా అందించనున్న ఫౌండేషన్
(భవానీపురం, ఆంధ్రప్రభ) : గర్భిణుల ఆరోగ్య పరిరక్షణకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తూ అత్యాధునిక వైద్య సేవలను పేదల ముంగిటకు తీసుకెళ్లడమే లక్ష్యం” అని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలోని ‘సుజనా ఫౌండేషన్’ ద్వారా గర్భిణీ స్త్రీల కోసం ఉచిత గుండె పరీక్షలు, మాతృ కార్డియాక్ రిస్క్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయం శుక్రవారం వెల్లడించింది.

పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విడతల వారీగా ఉచిత వైద్య శిబిరాలు, గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజారోగ్యానికి ప్రాధాన్యం ఇస్తున్న సుజనా చౌదరి, ఇప్పుడు గర్భిణుల ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించారు. గర్భధారణ సమయంలో వచ్చే గుండె సంబంధిత సమస్యలను ముందుగానే గుర్తించి తల్లి, శిశువు ప్రాణాలకు ముప్పు ఏర్పడకుండా నివారించేందుకు ఈ ప్రత్యేక స్క్రీనింగ్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.

పేద, మధ్యతరగతి గర్భిణీలు ఆర్థిక ఇబ్బందుల కారణంగా అత్యాధునిక వైద్య పరీక్షలకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఎలాంటి ఖర్చు లేకుండా ఈ సేవలను అందించనున్నట్లు పేర్కొన్నారు. ఆధునిక నిర్ధారణ పరీక్షలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే ‘సుజనా ఫౌండేషన్’ ప్రధాన లక్ష్యమని తెలిపారు. గర్భిణీ స్త్రీల కోసం తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని శనివారం చిట్టినగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ (చిన్ని), ఎన్డీఏ కూటమి ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ఎమ్మెల్యే సుజనా చౌదరి లాంఛనంగా ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయం వెల్లడించింది. రానున్న రోజుల్లో ఈ ఉచిత ఆరోగ్య పరీక్షలను పశ్చిమ నియోజకవర్గంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించనున్నట్లు తెలిపింది. గర్భిణీ స్త్రీలు, మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్యే కార్యాలయం విజ్ఞప్తి చేసింది.
