టాటా మ్యాజిక్–ట్రాక్టర్ ఢీ..
- ప్రమాదం నుంచి బయటపడ్డ టీచర్లు
హనుమకొండ/శాయంపేట, ఆంధ్రప్రభ : హనుమకొండ నుంచి మహాదేవపూర్‌కు విధులకు వెళ్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రయాణిస్తున్న టాటా మ్యాజిక్ శుక్రవారం శాయంపేట మండలం మాందారిపేట జాతీయ రహదారిపై హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలో ట్రాక్టర్‌ను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న పది మంది ఉపాధ్యాయులు గాయపడగా, డ్రైవర్ వేణు, ఉపాధ్యాయుడు రామ్మూర్తి వాహనంలో ఇరుక్కుపోయారు. ప్రతిరోజూ ఇదే టాటా మ్యాజిక్‌లో హనుమకొండ నుంచి మహాదేవపూర్‌కు వెళ్లే ఉపాధ్యాయులు శుక్రవారం కూడా విధులకు బయలుదేరిన సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ముందుగా వెళ్తున్న ట్రాక్టర్ ఒక్కసారిగా కుడివైపు తిరగడంతో వెనుక నుంచి వస్తున్న టాటా మ్యాజిక్ బలంగా ఢీకొట్టినట్లు సమాచారం.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు సమీపంలోని జేసీబీ సహాయంతో వాహనంలో చిక్కుకున్న డ్రైవర్, ఉపాధ్యాయుడిని బయటకు తీశారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ వేణుకు తీవ్ర గాయాలు కాగా, ఉపాధ్యాయుడు రామ్మూర్తికి కాలు విరగడంతో పాటు తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన ఎనిమిది మంది ఉపాధ్యాయులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
