Godavari-Sabari-Floods : మెల్లగా..మెల మెల్ల‌గా.Andhra Prabha Top News.

Godavari-Sabari-Floods : మెల్లగా..మెల మెల్ల‌గా.Andhra Prabha Top News.

  • గోదార‌మ్మ ఉరుకు ప‌రుగు
  • ఏజేన్సీలో నిద్ర లేచిన వాగులు వంకలు
  • చింతూరు శబరికి వరద దూకుడు

(ఆంధ్రప్రభ, చింతూరు (పోలవరం జిల్లా)

Godavari-Sabari-Floods : బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణితో రాష్ట్ర వ్యాప్తంగా, చత్తీష్‌ఘడ్‌, తెలంగాణ, ఒరిస్సా రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో పాటు చింతూరు ఏజేన్సీలో, ఎగువ ప్రాంతాల్లో గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఆ వరద నీరు చింతూరు మన్యంలోని శబరి, గోదావరి నదుల్లో కలసి క్రమేపీ నెమ్మదిగా పెరుగుతున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి నది మెల్లగా పెరుగుతూ శుక్రవారం మధ్యహ్నాం ఒంటిగంట సమయానికి 44.90 అడుగులకు కనిష్ట మట్టానికి చేరుకుంది. ఇది ఇలా ఉంటే చింతూరులోని శబరి నది సైతం నెమ్మదిగా పెరుగుతుంది. శబరి ఎగువ ప్రాంతాల్లో కురస్తున్న భారీ వర్షాల నేపధ్యంలో శబరి నదిలోకి భారీగా వరద నీరు చేరుకుంటుంది. మన్యంతో పాటు ఎగువ ప్రాంతాల్లో గత వారం రోజులుగా ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో ఆయా వరద నీరు శబరి నదిలో చేరుకుంటూ కనిష్ట మట్టానికి చేరుకొని నెమ్మదిగా పెరుగుతుంది. ఆంధ్రా సరిహద్దు రాష్ట్రాలైన ఒరిస్సా, చత్తీష్‌ఘడ్‌ రాష్ట్రాల్లో సైతం వర్షపాతం ఎక్కువ నమోదు అవుతుండటంతో చింతూరు ఎగువ ప్రాంతాలైన బలిమెల, డొంకరాయి, సీలేరు డ్యాంలలో వరద చేరుకుంటూ నిండుకుండలా తొణికిస‌లాడుతున్నాయి

Godavari-Sabari-Floods : వరద నీటిలో రహదారులు

చింతూరు రెవిన్యూ డివిజన్‌ పరిధిలోని శబరి, గోదావరి నదులు పెరగడంతో ఆ నదులకు అనుసంధానమైన వాగులు వంకలు పొంగిపొర్లుతూ రహదారులను వరద నీటితో ముంచేత్తాయి. ఈ నేపధ్యంలో కూనవరం మండలంలోని టేకులబోరు – కోండ్రాజు పేట గ్రామాల మధ్య వరద నీరు రహదారిపై చేరింది. అదే విధంగా ఎటపాక మండలంలోని నెల్లిపాక – వీరాయిగూడెం గ్రామాల మధ్య గోదావరి వరద నీరు రహదారిపైకి చేరింది. చింతూరు మండలంలోని సోకిలేరు, కుయుగూరు, అత్తకోడల్లు, చంద్రవంక, చీకటి వాగులు వరదతో నిండుకున్నాయి.

Godavari-Sabari-Floods : అధికారులు అప్రమత్తం

మన్యంలో మెల్లగా వరద పెరగడంతో పాటు భద్రాచలం వద్ద మొదటీ ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ క్రమంలో పోలవరం (రంపచోడవరం ) జిల్లా కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ చింతూరు, కూనవరం, విఆర్‌ పురం మండలాల్లో పర్యటిస్తున్నారు. వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులతో పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వరద నీరు చేరిన రహదారుల వద్ద స్థానిక అధికారులు ప్రజలెవరూ దాటకుండా పహరా కాస్తున్నారు.