తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి
తాగునీటి, మరుగుదొడ్ల పనులను త్వరితగతిన గ్రౌండ్ చేయాలి
జిల్లా కలెక్టర్ డీకే బాలాజి
మచిలీపట్నం, ఆంధ్రప్రభ : గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా విషయంలో అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లోనూ తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు కార్యాచరణతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి అధికారులను ఆదేశించారు.
మంగళవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్‌డబ్ల్యూఎస్), ఐసీడీఎస్, జిల్లా పంచాయతీ తదితర శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ ఆయా పనుల వారీగా పురోగతిని సమీక్షించారు.
జిల్లాలో తాగునీటి పరిస్థితిపై సమగ్రంగా సమీక్షించిన కలెక్టర్, వర్షాభావ పరిస్థితుల వల్ల రానున్న రోజుల్లో నీటి కొరత ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు కార్యాచరణతో వ్యవహరించాలని సూచించారు. కాలువల ద్వారా వచ్చే నీటి ప్రవాహాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చోట మోటార్లు, పంపులు, ట్యాంకర్ల ద్వారా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు.
ఎక్కడైనా సమస్యలు తలెత్తే అవకాశం ఉంటే వెంటనే జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేశారు. తాగునీటి సరఫరా విషయంలో రెవెన్యూ, పోలీసు, ఇరిగేషన్ తదితర శాఖలతో సమన్వయం చేసుకుంటూ సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు.
గత సమావేశంలో నిర్దేశించిన ఐహెచ్‌హెచ్‌ఎల్ పనుల పురోగతిని సమీక్షించిన కలెక్టర్, పెండింగ్‌లో ఉన్న పనులను వెంటనే గ్రౌండ్ చేయాలని ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో తాగునీటి వసతి, మరుగుదొడ్ల నిర్మాణం, వ్యక్తిగత గృహ మరుగుదొడ్ల (ఐహెచ్‌హెచ్‌ఎల్) పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టి తదుపరి సమీక్ష సమావేశం నాటికి పూర్తి స్థాయిలో గ్రౌండ్ చేయాలని స్పష్టం చేశారు.
నిధుల కొరత కారణంగా ఎక్కడా పనులు నిలిచిపోకుండా అవసరమైతే గ్రామపంచాయతీ నిధులను వినియోగించి పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కొత్తగా మంజూరైన వ్యక్తిగత గృహ మరుగుదొడ్లను కూడా ఆలస్యం లేకుండా ప్రారంభించి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు.
సీఎస్‌ఆర్, ఇతర అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన ప్రాజెక్టులను కూడా వేగవంతం చేసి, సంబంధిత సంస్థలతో నిరంతర సమన్వయం కొనసాగించాలని కలెక్టర్ సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ప్రతి శాఖ బాధ్యతాయుతంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో గ్రామీణ నీటి సరఫరా విభాగం ఎస్ఈ సోమశేఖర్, ఈఈ నటరాజ్, ఐసిడిఎస్ పిడి ఎంఎన్ రాణి, డిపిఓ ఎం ధనలక్ష్మి, డిప్యూటీ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఆనంద్, డివిజన్లు, మండలాల ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
