కుండపోతతో కుదేలైన హైదరాబాద్..!

వాన జోరు… ట్రాఫిక్‌కు బ్రేక్!

హైదరాబాద్, ఆంధ్రప్రభ : మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి నగర జనజీవనం అస్తవ్యస్తమైంది. కార్యాలయాలు ముగిసే వేళ వర్షం జోరందుకోవడంతో వేలాది మంది ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రధాన రహదారులపై వాహనాలు భారీగా నిలిచిపోవడంతో నగరవ్యాప్తంగా ట్రాఫిక్ స్తంభించింది. గంటల తరబడి వాహనాలు నత్తనడకన సాగడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు.

రోడ్లపై భారీగా వర్షపు నీరు చేరి ప్రవహించడంతో ద్విచక్ర వాహనదారులు, పాదచారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నీటి అడుగున గుంతలు, తెరిచి ఉన్న మ్యాన్‌హోళ్లు ఉండొచ్చనే ఆందోళనతో పలువురు సురక్షిత ప్రాంతాల్లోనే నిలిచిపోయారు. పలుచోట్ల వాహనాలు మధ్యలోనే నిలిచిపోవడంతో ట్రాఫిక్ మరింత దిగ్బంధానికి గురైంది.

జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, లక్డీకాపూల్, పంజాగుట్ట, ఎల్‌బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, మెహిదీపట్నం, అమీర్‌పేట్, ఖైరతాబాద్, మసాబ్‌ట్యాంక్, కూకట్‌పల్లి, గచ్చిబౌలి, హైటెక్ సిటీ పరిసరాల్లో కుండపోత వర్షం కురిసింది. పలు లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

అత్యవసర పనుల కోసం బయటకు వచ్చిన ప్రజలు వర్షం నుంచి తలదాచుకునేందుకు బస్‌స్టాప్‌లు, మెట్రో స్టేషన్లు, దుకాణాల షెడ్ల వద్ద ఆశ్రయం పొందారు. కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లేందుకు క్యాబ్‌లు, ఆటోలు దొరకక చాలామంది ఇబ్బందులు పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాయి.

వర్షం కారణంగా నగరంలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టి వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించే ప్రయత్నం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం హైదరాబాద్‌లో మేఘావృత వాతావరణంతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. నగరవాసులు అత్యవసరమైతేనే బయటకు రావాలని, వర్షం సమయంలో నీటితో నిండిన రహదారులపై ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.