వాగులో స్నానానికి దిగి ఇద్దరు యువకుల గల్లంతు
చింతూరు, ఆంధ్రప్రభ : ఏజెన్సీ ప్రాంతాల్లో విహారయాత్ర మరోసారి విషాదానికి దారితీశాయి. పోలవరం జిల్లా చింతూరు మండలం మోతుగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని తులసిపాక ఘాట్ రోడ్డులో ఉన్న తొలి వ్యూ పాయింట్ సమీపంలోని సోకులేరు వాగులో ఈతకు దిగిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
వెస్ట్ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం విరంపాలెం గ్రామానికి చెందిన కల్యాణ్ (26), బాబు (21) అదే గ్రామానికి చెందిన మరో ముగ్గురు స్నేహితులతో కలిసి విహారయాత్ర కోసం సోకులేరు వ్యూ పాయింట్‌కు వచ్చారు. ప్రకృతి అందాలను వీక్షించిన అనంతరం వాగులో ఈతకు దిగారు.

ఈ సమయంలో నీటి లోతు అంచనా వేయలేక బాబు ఒక్కసారిగా మునిగిపోయాడు. అతడిని కాపాడేందుకు వరసకు బాబాయ్ అయిన కల్యాణ్ వెంటనే నీటిలోకి దూకాడు. అయితే ప్రవాహం, నీటి లోతు కారణంగా అతడూ బయటకు రాలేక ఇద్దరూ వాగులో గల్లంతయ్యారు.
సమాచారం అందుకున్న చింతూరు సర్కిల్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాల సహాయంతో గల్లంతైన ఇద్దరు యువకుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
ఈ ఘటనపై చింతూరు సీఐ గోపాల్‌కృష్ణ మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతాలకు వచ్చే పర్యాటకులు ప్రకృతి అందాలను ఆస్వాదించే సమయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నీటి లోతు తెలియని వాగులు, జలపాతాల్లోకి ఈతకు దిగవద్దని, ముఖ్యంగా పోలీసులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇటీవలి కాలంలో ఏజెన్సీ ప్రాంతాల్లో ఇలాంటి ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో పర్యాటకులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని పోలీసులు మరోసారి హెచ్చరించారు. ప్రస్తుతం గల్లంతైన యువకుల కోసం సహాయక బృందాలు నిరంతరం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.
